తెలంగాణలో ఎఫ్‌డీల‌పై అధికారుల ఇష్టారాజ్యం చెల్ల‌దిక‌: తెలంగాణ స‌ర్కారు ఆదేశం

  • ప్ర‌భుత్వ లీడ్ బ్యాంకులోనే ఎఫ్‌డీలు చేయాలి
  • బ్యాంకు ఖాతా తెర‌వాల‌న్నా స‌ర్కారు అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి
  • వాడ‌ని ఖాతాల‌ను త‌క్ష‌ణ‌మే క్లోజ్ చేయాల్సిందే
  • అన్ని శాఖ‌ల‌కు తెలంగాణ స‌ర్కారు ఆదేశాలు
ప్ర‌భుత్వంలోని వివిధ శాఖ‌లు త‌మ వ‌ద్ద ఉన్న నిధుల‌ను త‌మకు ఇష్టం వ‌చ్చిన బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లుగా మారుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆయా శాఖ‌ల అధిప‌తులు వారి ఇష్టారాజ్యంగా ఎఫ్‌డీల విష‌యంలో వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు కూడా తెలిసిందే. అయితే ఇటీవ‌ల తెలుగు అకాడెమీకి చెందిన వంద‌ల కోట్ల విలువ ఉన్న ఎఫ్‌డీల‌ను కొంద‌రు వ్య‌క్తులు గుట్టు చ‌ప్పుడు కాకుండా కొట్టేశారు. దీంతో మేల్కొన్న తెలుగు అకాడెమీ ల‌బోదిబోమ‌న్నా.. ఆ నిధులు ఇప్ప‌టికీ త‌న ద‌రికి చేర‌లేదు. ఈ చేదు అనుభ‌వం నేప‌థ్యంలో తెలంగాణ స‌ర్కారు ఓ కీల‌క నిర్ణయం తీసుకుంది. ఇక‌పై ప్ర‌భుత్వ లీడ్ బ్యాంక్ లోనే ఎఫ్‌డీల‌ను చేయాల‌ని, ఇత‌ర‌త్రా బ్యాంకుల్లో ఎఫ్‌డీల‌ను చేయ‌డం కుద‌ర‌ద‌ని తేల్చి చెప్పేసింది.

ఈ మేర‌కు సోమ‌వారం తెలంగాణ స‌ర్కారు త‌న ప‌రిధిలోని అన్ని శాఖ‌ల‌కు ఆదేశాలు జారీ చేసింది. అందుబాటులో ఉన్న నిధుల‌ను అవ‌స‌ర‌మైన మేర‌కు అట్టిపెట్టుకుని.. మిగిలిన మొత్తాల‌ను ఎఫ్‌డీలుగా మార్చాల‌ని, అయితే ఆ ఎఫ్‌డీల‌ను ప్ర‌భుత్వ లీడ్ బ్యాంకులోనే చేయాల‌ని ఆదేశించింది. అంతేకాకుండా ఆయా శాఖ‌లు ఇష్టారాజ్యంగా బ్యాంకు ఖాతాలు తెర‌వ‌డం కూడా ఇక‌పై కుద‌ర‌ద‌ని, ఆయా శాఖ‌లు బ్యాంకు ఖాతాలు తెర‌వాలంటే ఇక‌పై ప్ర‌భుత్వ అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి అని కూడా ఓ నిబంధ‌న పెట్టేసింది. అంత‌టితో ఆగ‌కుండా.. ఆయా శాఖ‌ల‌కు చెందిన వాడ‌ని బ్యాంకు ఖాతాల‌ను త‌క్ష‌ణ‌మే మూసివేయాల‌ని, ఈ వివ‌రాల‌న్నింటిని అంద‌జేయాల‌ని కూడా తెలంగాణ స‌ర్కారు అన్ని శాఖ‌ల‌కు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసింది.


More Telugu News