26 బంతుల్లోనే 50 రన్స్... అత్యంత వేగంగా ఫిఫ్టీ సాధించిన భారత మహిళా క్రికెటర్

  • క్వీన్స్ టౌన్ లో టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్
  • మహిళల వన్డే సిరీస్
  • 52 పరుగులు చేసిన రిచా ఘోష్
  • 4 ఫోర్లు, 4 సిక్సర్లు బాదిన బెంగాలీ అమ్మాయి
  • భారత్ తరఫున అత్యంత వేగవంతమైన ఫిఫ్టీ
న్యూజిలాండ్, భారత్ మహిళా జట్ల మధ్య క్వీన్స్ టౌన్ లో నాలుగో వన్డే జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా అమ్మాయిలు 63 పరుగుల తేడాతో ఓడిపోయినప్పటికీ, ఓ అరుదైన రికార్డు ఆవిష్కృతమైంది. భారత బ్యాటర్ రిచా ఘోష్ కేవలం 26 బంతుల్లోనే అర్ధశతకం సాధించింది. భారత మహిళా వన్డే క్రికెట్లో ఇప్పటివరకు ఇదే అత్యంత వేగవంతమైన ఫిఫ్టీ కావడం విశేషం.

ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు 191 పరుగులు చేయగా, టీమిండియా 17.5 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే, బెంగాల్ అమ్మాయి రిచా ఘోష్ పోరాటం అందరినీ ఆకట్టుకుంది. భారత్ తరఫున ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేసే క్రమంలో రిచా 4 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టింది. 52 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆమె అవుటైంది.

కాగా, గతంలో ఈ రికార్డు వేదా కృష్ణమూర్తి పేరిట ఉంది. వేదా దక్షిణాఫ్రికా మహిళల జట్టుపై 32 బంతుల్లోనే అర్ధసెంచరీ చేసింది. ఇప్పుడు ఫాస్టెస్ట్ ఫిఫ్టీ జాబితాలో వేదా రెండో స్థానానికి పడిపోయింది. కాగా, మూడోస్థానంలో తెలుగమ్మాయి సబ్బినేని మేఘన ఉంది. ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లోనే మేఘన 33 బంతుల్లో ఫిఫ్టీ నమోదు చేయడం విశేషం.


More Telugu News