ధార్మిక మండ‌లిని దోపిడీ మండలిగా చేశారు: నారా లోకేశ్

  • సేవా టికెట్ల‌ను వాటాలేసుకుని పంచుకుంటున్నార‌ని వ్యాఖ్య‌
  • ప్ర‌సాదం, వ‌స‌తి ధ‌ర‌ల‌ను భారీగా పెంచార‌ని ఆగ్ర‌హం
  • క్రిమిన‌ల్ కేసులున్న వారిని బోర్డు సభ్యులుగా ఎంపిక చేశార‌ని ఎద్దేవా
క‌లియుగ దైవం శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌య పాల‌నా వ్య‌వ‌హారాల కోసం ఏర్పాటైన ధార్మిక మండ‌లి తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ)ని దోపిడీ మండ‌లిగా మార్చేశార‌ని టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ విమ‌ర్శించారు. శ్రీవారి సేవా టికెట్ల‌ను టీటీడీ పాల‌క మండ‌లి స‌భ్యులే దోపిడీ దొంగ‌ల్లా వాటాలేసుకుని మ‌రీ పంచుకుంటున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ వేదిక‌గా జ‌గ‌న్ స‌ర్కారుపై నారా లోకేశ్ విమ‌ర్శ‌లు సంధించారు.

బుధ‌వారం సాయంత్రం తాను చేసిన వ‌రుస ట్వీట్ల‌లో..  "టిటిడి ధార్మిక‌మండ‌లిని @ysjagan దోపిడీ మండలిగా చేశారు. శ్రీవారి సేవా టికెట్లను దోపిడీ దొంగ‌ల్లా టిటిడి పాలక మండలి సభ్యులు వాటాలేసుకుంటున్నారు. ప్ర‌సాదం, వస‌తి, సేవా టికెట్ల రేట్లు భారీగా పెంచి ఏడుకొండ‌ల‌వాడిని భక్తులకు దూరం చేసే కుట్ర చేస్తున్నారు.

31 కేసుల్లో నిందితుడైన సీఎం, క్రిమినల్ కేసులున్న 16 మందిని పాల‌క‌మండ‌లి స‌భ్యులుగా వేశారు. శివరాత్రి బ్రహ్మోత్సవాలకు రాష్ట్రంలో ఏ ఆల‌యానికి అడ్డురాని కోవిడ్ నిబంధనలు తిరుపతిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలకు మాత్రమే ఎందుకు అడ్డొచ్చాయో పాల‌క‌మండ‌లి స‌మాధానం ఇవ్వాలి. హిందువులు, శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ పాల‌క‌మండ‌లి తీసుకుంటున్న వివాదాస్ప‌ద నిర్ణ‌యాలు వెన‌క్కి తీసుకోవాలి, సేవాటికెట్ల రేట్లు త‌గ్గించాలి, సామాన్యుల‌కు శ్రీవారి ద‌ర్శ‌న‌భాగ్యం క‌ల్పించాలి" అంటూ లోకేశ్ డిమాండ్ చేశారు.


More Telugu News