గృహ హింస కేసులో టెన్నిస్ దిగ్గజం లియాండర్‌ పేస్‌కు కోర్టులో చుక్కెదురు.. భాగస్వామికి నెలకు రూ. లక్ష చెల్లించాలని ఆదేశం

  • మోడల్ రియా పిళ్లైతో 8 ఏళ్లుగా సహ జీవనం
  • 2014లో పేస్‌పై గృహ హింస కేసు పెట్టిన రియా
  • ఆరోపణలు నిజమని తేల్చిన కోర్టు
  • వేరుగా ఉంటే అద్దె కింద మరో రూ. 50 వేలు చెల్లించాలని ఆదేశం
భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్‌ పేస్‌కు ముంబైలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పేస్ మాజీ భాగస్వామి, ప్రముఖ మోడల్-నటి రియా పిళ్లై దాఖలు చేసిన గృహ హింస కేసును విచారించిన కోర్టు ఆరోపణలు నిజమని తేల్చింది. 

దీంతో నిర్వహణ ఖర్చుల కింద ఆమెకు నెలకు లక్ష రూపాయలు చెల్లించాలని, అలాగే, ఇంటి అద్దె కింద మరో రూ. 50 వేలు చెల్లించాలని ఆదేశించింది. అయితే, ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటే అద్దె మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదని, ఆమె బయటకు వెళ్లిపోవాలని కోరుకుంటే కనుక ఆ మొత్తం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోమల్‌సింగ్ రాజ్‌పుట్ ఈ నెల మొదట్లోనే ఈ తీర్పు వెలువరించగా, తాజాగా ఇది వెలుగులోకి వచ్చింది.

8 సంవత్సరాలుగా పేస్, తాను సహజీవనం చేస్తున్నామని, అయితే ఇటీవల తనపై గృహ హింసకు పాల్పడుతున్నట్టు ఆరోపిస్తూ 2014లో రియా పిళ్లై కోర్టును ఆశ్రయించారు. అతడు తనను మానసికంగా, ఆర్థికంగా వేధించడమే కాకుండా ఇష్టంవచ్చినట్టు దూషిస్తున్నాడని, ఫలితంగా మానసికంగా కుంగిపోయానని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. విచారించిన న్యాయస్థానం ఆమె ఆరోపణలు నిజమని తేల్చి తీర్పు వెలువరించింది.


More Telugu News