ఇలాంటి టైటిల్స్ తో ఇబ్బందే!

  • తెలుగులోనూ తమిళ టైటిల్స్ 
  • టైటిల్ కి అర్థం చెప్పే ప్రయత్నం లేదు 
  • 'వలిమై'కి దక్కని ఆదరణ 
  • అదే బాటలో వస్తున్న 'ఈటి'

ఇంతకుముందు తమిళం నుంచి తెలుగులోకి ఏ సినిమా వచ్చినా తెలుగులోనే టైటిల్ ఉండేది. కాకపోతే ఆ టైటిల్ ను బట్టే అది డబ్బింగ్ సినిమా అనే విషయం అర్థమైపోయేది. కథకి తగిన టైటిల్ పడినప్పుడు స్ట్రయిట్ సినిమాలతో సమానంగా ప్రేక్షకులు ఆదరించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు పాన్ ఇండియా పేరు చెప్పేసి అన్ని భాషల్లో ఒకే టైటిల్ తో రిలీజ్ చేసే పరిస్థితి కనిపిస్తోంది.
  
సినిమాకి టైటిల్ ప్రాణం .. హీరో .. హీరోయిన్ ఎవరైనా, టైటిల్ కూడా ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించడంలో ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. కథ నచ్చడం .. డైలాగ్స్ ను మెచ్చడం .. హిట్ టాక్ రావడం .. ఇవన్నీ థియేటర్స్ కి వచ్చిన తరువాత సంగతి. కథాకథనాలు బాగున్నప్పటికీ సరైన టైటిల్ పడకపోవడం వలన జనాలు పట్టించుకోని సినిమాలు చాలానే ఉన్నాయి. 

ఇటీవల తమిళం నుంచి వచ్చిన 'వరుణ్ డాక్టర్' ను ఇక్కడ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ సినిమా అక్కడ 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఇక్కడ పట్టించుకోకపోవడానికి కారణం .. టైటిల్ ఇంట్రెస్టింగ్ గా లేకపోవడమే. ఇక రీసెంట్ గా వచ్చిన అజిత్ 'వలిమై'కి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. 'వలిమై' అంటే తెలుగులో అర్థం ఏమిటి అనే విషయం కూడా చెప్పకుండా అంత బడ్జెట్ సినిమాను జనంలోకి వదిలారు.

ఇక వచ్చేనెల 10వ తేదీన సూర్య సినిమా వస్తుంది. తమిళంలో పేరు 'ఎతరుక్కుమ్ తునింధవన్'. కానీ తెలుగులో 'ఈటి' అనే పేరుతో థియేటర్స్ కి తీసుకుని వస్తున్నారు. 'ఎవరికీ తలవంచడు' అనేది ట్యాగ్ లైన్. పోనీ దానినే టైటిల్ గా సెట్ చేస్తే బాగుండేది. కానీ ఇక్కడ పాన్ ఇండియా సమస్య ఉందని అంటారు. ఇలా అర్థంకాని టైటిల్స్ తో సినిమాలను వదిలితే మాత్రం ఇబ్బందే అనే విషయం ఇప్పటికే కొంతమందికి అర్థమైపోయింది .. అనుభవంలోకి వచ్చింది కూడా.


More Telugu News