ఉక్రెయిన్‌లో భారత విద్యార్థికి బుల్లెట్ గాయం.. తప్పిన ప్రాణాపాయం

  • కీవ్ నుంచి స్నేహితులతో కలిసి ట్యాక్సీలో బయలుదేరిన హర్‌జ్యోత్ సింగ్
  • శరీరంలోకి నాలుగు తూటాలు
  • ధ్రువీకరించిన కేంద్రమంత్రి జనరల్ వీకే సింగ్
  • భారతీయుల తరలింపు కోసం మాస్కోలో రెండు వాయుసేన విమానాలు
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఓ భారత విద్యార్థి తప్పించుకునే ప్రయత్నంలో గాయాలపాలయ్యాడు. నాలుగు తూటాలు అతడి శరీరంలోకి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అయితే, ప్రాణాపాయం నుంచి మాత్రం బయటపడ్డాడు. 

ఢిల్లీకి చెందిన హర్‌జ్యోత్ సింగ్ (31) గత నెల 27 నుంచి మరో ఇద్దరు స్నేహితులతో కలిసి కీవ్ నుంచి ట్యాక్సీలో బయలుదేరాడు. ఈ క్రమంలో రష్యా-ఉక్రెయిన్ సైన్యానికి మధ్య జరిగిన కాల్పుల్లో నాలుగు తూటాలు అతడి శరీరాన్ని చీల్చుకుంటూ లోపలికి వెళ్లాయి. దీంతో వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. 

పరీక్షించిన వైద్యులు అతడి శరీరంలో బులెట్లు ఉన్నట్టు గుర్తించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతడికి ప్రాణాపాయం తప్పిందని, ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటన జరిగినప్పుడు తాను కీవ్‌లోని మన రాయబార కార్యాలయానికి సమీపంలోనే ఉన్నప్పటికీ అధికారులు ఎవరూ సరిగ్గా స్పందించలేదని హర్‌జ్యోత్ ఆరోపించాడు. చావు తప్పదనే అనుకున్నానని, కానీ ప్రాణాలతో బయటపడ్డానని అన్నాడు. వెంటనే తనను భారత్ తరలించాలని కోరాడు. ఆయన గాయపడిన విషయాన్ని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జనరల్ వీకే సింగ్ ధ్రువీకరించారు.

 మరోవైపు, ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను తరలించే ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఖార్కివ్‌లో 300 మంది, సూమెలో ఇంకా 700 మంది వరకు భారతీయులు ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. సుమీ, ఖర్కివ్ నగరాల నుంచి భారతీయులను తరలించేందుకు రష్యా రాజధాని మాస్కోలో రెండు ఐఎల్-76 విమానాలను సిద్ధంగా ఉంచినట్టు వాయుసేన తెలిపింది.


More Telugu News