వీవీప్యాట్ లను ముందే లెక్కించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్

  • ప్రస్తుతం ఓట్ల లెక్కింపు తర్వాత వీవీప్యాట్ ల తనిఖీ
  • అప్పుడు ఎవరూ ఉండరన్న పిటిషనర్ 
  • దాంతో పారదర్శకతకు అవకాశం లేదని ఆరోపణ  
  • ముందే చేపట్టేలా ఆదేశాలు ఇవ్వమని కోరిన పిటిషనర్ 
కీలకమైన ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ కు ముందు వీవీప్యాట్ ల లెక్కింపుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తమైన ఓట్లను లెక్కించడానికి ముందు వీవీప్యాట్ (ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్) ను తనిఖీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. 

పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది మీనాక్షి అరోరా వాదనలు వినిపించారు. ‘‘ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత వీవీ ప్యాట్ వెరిఫికేషన్ చేస్తున్నారు. ఆ సమయంలో ఎలక్షన్ ఏజెంట్లు కూడా వెళ్లిపోతారు. కనుక అప్పుడు తనిఖీ చేయడంలో పారదర్శకత ఉండదు. కనుక ఓట్ల లెక్కింపు తర్వాత చేసే వీవీప్యాట్ తనిఖీతో ఉపయోగం లేదు. అందుకని ఓట్లను లెక్కించడానికి ముందుగానే దీన్ని చేపట్టాలి’’ అని కోర్టును కోరారు. 

చివరి నిమిషంలో ఈ అంశాన్ని ఎందుకు విచారణలో చేర్చారంటూ? చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. ‘‘చివరి నిమిషంలో కోరితే మేము ఎలా సాయపడగలము? ఒక రోజు తర్వాతే కౌంటింగ్ ఉంది. ఈ అంశంపై రేపు (బుధవారం) విచారణ చేపట్టినా.. అన్ని రాష్ట్రాలకు మీరు కోరినట్టు ఆదేశాలు జారీ చేయడం సాధ్యపడుతుందా? సరే చూద్దాం, ఏం చేయగలమన్నది’’ అని చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై బుధవారం సుప్రీంకోర్టు విచారణ నిర్వహించనుంది. 

వీవీప్యాట్ అన్నది ప్రతీ ఓటర్ వేసిన ఓటును ధ్రువీకరిస్తూ వచ్చే పేపర్ ఓచర్. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లకు అనుసంధానంగా పోలింగ్ బూత్ లలో వీటిని ఏర్పాటు చేస్తారు. తద్వారా ఈవీఎంలలో లోపాలు, అవకతవకలు, మోసాలను గుర్తించేందుకు అవకాశం ఉంటుంది. అన్నీ కాకుండా ప్రతి నియోజకవర్గంలో ర్యాండమ్ గా కొన్ని చోట్ల వీవీప్యాట్ స్లిప్ లను కూడా లెక్కించి ధ్రువీకరించే విధానం ప్రస్తుతం నడుస్తోంది.


More Telugu News