కందికొండ మృతిపై కేటీఆర్ భావోద్వేగ ట్వీట్‌

  • కందికొండ‌కు స‌ర్కారీ ఖ‌ర్చుల‌తో వైద్యం
  • కేటీఆర్ చొర‌వ‌తోనే సాధ్య‌మైన వైనం
  • ఆ జ్ఞాప‌కాల‌తోనే కేటీఆర్ భావోద్వేగ ట్వీట్‌
తెలుగు సినీ గేయ ర‌చ‌యిత కందికొండ యాద‌గిరి తీవ్ర అనారోగ్యంతో శ‌నివారం సాయంత్రం క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణ‌లోని వ‌రంగ‌ల్ జిల్లా న‌ర్సంపేట‌కు చెందిన కందికొండ‌.. ఉస్మానియాలో విద్యాభ్యాసం త‌ర్వాత సినీ గేయ ర‌చ‌యిత‌గా ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే సినీ గేయ ర‌చ‌యిత‌గా దూసుకుపోతున్న స‌మ‌యంలోనే ఆయ‌న‌ను వెన్నెముక స‌మ‌స్య వెన‌క్కు లాగేసింది. 2018 నుంచి అనారోగ్యంతోనే స‌త‌మ‌త‌మ‌వుతున్న కందికొండ శ‌నివారం మృతి చెందారు.

ఈ వార్త తెలిసిన వెంట‌నే టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ షాక్‌కు గుర‌య్యారు. కందికొండ మృతి ప‌ట్ల ఆయ‌న త‌న తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు కేటీఆర్ ఓ భావోద్వేగ ట్వీట్‌ను పోస్ట్ చేశారు. కందికొండ ఆత్మకు శాంతి చేకూరాలని కేటీఆర్‌ ప్రార్థించారు. 

తెలంగాణ సంస్కృతిని తన సాహిత్యం ద్వారా జనసామాన్యానికి తెలిపిన కందికొండ మరణం తెలంగాణకు తీరని లోటని ఆయ‌న‌ అన్నారు. కందికొండ పాటలు తెలంగాణ సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కందికొండ కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

వెన్నెముక స‌మ‌స్య‌తో కందికొండ తీవ్ర అనారోగ్యానికి గుర‌య్యార‌న్న వార్త తెలియ‌గానే.. గ‌తంలో కేటీఆర్ చాలా వేగంగా స్పందించిన సంగ‌తి తెలిసిందే. కందికొండ అనారోగ్యంతో మంచం ప‌ట్ట‌డంతో ఆయ‌న కుటుంబం తీవ్ర‌మైన ఆర్థిక ఇబ్బందుల్లో ప‌డిపోయింది. ఈ విష‌యం తెలుసుకున్న‌కేటీఆర్.. కందికొండ‌కు ప్ర‌భుత్వ ఖ‌ర్చుతో వైద్యం చేయించే ఏర్పాట్లు చేశారు. కేటీఆర్ చొర‌వతో అందిన వైద్యం వ‌ల్ల కందికొండ కాస్తంత కోలుకున్న‌ట్టే క‌నిపించినా.. తిరిగి తీవ్ర అస్వ‌స్థత‌కు గురైన ఆయ‌న శ‌నివారం మ‌ర‌ణించారు.


More Telugu News