ఎవరికీ తెలియని విషయాలు చాలా ఉన్నాయి.. కశ్మీరీ పండిట్ల ఊచకోతపై ‘కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్

  • సినిమా వెనుక నాలుగేళ్ల కష్టం ఉంది
  • కశ్మీరీ పండిట్ల దగ్గర సమాచారం సేకరించాం
  • వారు చెప్పిన వాటి ఆధారంగానే సినిమా
  • వాటిపై సిరీస్ చేస్తామన్న వివేక్ అగ్నిహోత్రి
బాక్సాఫీస్ దగ్గర ప్రకంపనలు సృష్టిస్తున్న సినిమా ‘ద కశ్మీర్ ఫైల్స్’. 1990ల్లో కశ్మీరీ పండిట్లపై జరిగిన అకృత్యాలు, అరాచకాలను డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి కళ్లకు కట్టారు. సినిమా వెనుక ఎన్నో ఏళ్ల కష్టం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. 

700 మందికిపైగా పండిట్లను కలిసి జరిగిన విషయాలను తెలుసుకుని సినిమా తీశానని చెప్పారు. సినిమా కోసం దాదాపు నాలుగేళ్ల పాటు రీసెర్చ్ చేశానని తెలిపారు. గ్లోబల్ కశ్మీరీ పండిట్ డయాస్పోరా (జీకేపీడీ) సంస్థ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కశ్మీరీ పండిట్లను కలిశానన్నారు. 

ఆనాడు జరిగిన ఊచకోతలకు సంబంధించి చాలా మందికి చాలా విషయాలు తెలియవని, సినిమాలో చూపించింది కొంతేనని అన్నారు. గుండెల్ని పిండేసే ఘటనలు జరిగాయన్నారు. ఆ వివరాలన్నీ తన వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. వాటి ఆధారంగా ఓ వెబ్ సిరీస్ ను తెరకెక్కించనున్నట్టు వెల్లడించారు. ‘‘ఇవన్నీ నిజాలు. మనసును కలచివేసే సత్యాలు. మనుషుల నిజమైన కథలు’’ అని ఆయన చెప్పారు. 

కశ్మీరీ పండిట్ల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నారు. ఎవరికీ తెలియని నిజమైన సంఘటనల ఆధారంగా కశ్మీర్ ఫైల్స్ ను తెరకెక్కించామన్నారు. నిజంగా హిందువులకు ఇలా జరిగిందంటే నమ్మలేకున్నామని చాలా మంది అన్నారని ఆయన తెలిపారు.


More Telugu News