స్పీడు పెంచిన ఆప్.. తెలంగాణ‌లో ఇక పాద‌యాత్ర‌!

  • ఏప్రిల్ 14 నుంచి తెలంగాణ‌లో ఆప్ పాద‌యాత్ర‌
  • ఢిల్లీలో సోమ్ నాథ్ భార‌తి ప్ర‌క‌ట‌న‌
  • ఫీల్డ్ అసిస్టెంట్ల కోసం పోరాడామ‌ని వెల్ల‌డి
  • చ‌నిపోయిన వారికి కోటి రూపాయల చొప్పున ప‌రిహారం ఇవ్వాల‌ని డిమాండ్‌
ఆదిలోనే దేశ రాజ‌ధానిలో విక్ట‌రీ.. తాజాగా పంజాబ్‌లో గ్రాండ్ విక్ట‌రీతో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌)లో గెలుపు విశ్వాసాన్ని బాగానే పెంచేశాయ‌నే చెప్పాలి. అప్ప‌టిదాకా కాస్తంత స్త‌బ్దుగా సాగిన ఆప్ శ్రేణులు మొన్న‌టి పంజాబ్ గెలుపుతో ఒక్క‌సారిగా యాక్టివేట్ అయిపోయాయి.

దేశంలోని మిగిలిన రాష్ట్రాల‌పైనా దృష్టి సారించ‌నున్న‌ట్లుగా పార్టీ కేంద్ర నాయ‌క‌త్వం ప్ర‌క‌టించ‌గా, అందుకు అనుగుణంగా ఆయా రాష్ట్రాల్లో ఆ పార్టీ శ్రేణులు కూడా త‌మ ప్రాంతాల్లో పార్టీ కార్య‌క్ర‌మాల్లో జోరు పెంచుతున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ‌లో త్వ‌ర‌లోనే ఆప్ పాద‌యాత్ర మొద‌లు కానుంది. ఈ మేర‌కు ఆ పార్టీ కీల‌క నేత సోమ్ నాథ్ భార‌తి మంగ‌ళ‌వారం ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

మంగ‌ళ‌వారం నాడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన పార్టీ దక్షిణాది రాష్ట్రాల ఇంచార్జ్ సోమనాథ్ భారతి.. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ పోరాడుతుందని ప్రకటించారు. అందులో భాగంగా ఏప్రిల్ 14వ తేదీ నుంచి తెలంగాణలో పాదయాత్ర ప్రారంభిస్తామని ఆయ‌న‌ తెలిపారు. ఇప్పటికే తెలంగాణలో ప‌లు రాజకీయ పార్టీల‌ నేతలు పాదయాత్రలో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఆప్ పాద‌యాత్ర కూడా మొద‌లు కానుండ‌టం గ‌మ‌నార్హం.

ఈ పాదయాత్ర ద్వారా ఆప్ ల‌క్ష్యాల‌ను ఇంటింటికి తీసుకెళ్తామని సోమ్ నాథ్ భార‌తి తెలిపారు. తొలగించిన ఫెల్డ్ అసిస్టెంట్లకు రెండేళ్ల జీతం కట్టించాలని డిమాండ్‌ చేసిన ఆయన.. రాష్ట్రవ్యాప్తంగా 70కి పైగా ఫీల్డ్ అసిస్టెంట్లు ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. వారికి కోటి రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా విధుల నుంచి బహిష్కరించిందని మండిపడ్డ ఆయన.. జాతీయ పార్టీలైన కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఈ అంశంపై మాట్లాడలేదని విమర్శించారు. ఆమ్‌ఆద్మీ పార్టీ ఫీల్డ్ అసిస్టెంట్స్ కోసం పోరాడిందని ఆయ‌న వెల్ల‌డించారు.


More Telugu News