ఉక్రెయిన్ కు సాయం అందిస్తాం: ఇండియా

  • ఉక్రెయిన్ లో పరిస్థితులు దిగజారుతున్నాయి
  • ఇరు దేశాలు దౌత్య మార్గాల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలి
  • ఉక్రెయిన్ పౌరులకు అందరూ మానవత్వంతో సాయం చేయాలన్న భారత్  
రష్యా చేస్తున్న యుద్ధం వల్ల ఉక్రెయిన్ లో పరిస్థితులు నానాటికీ దిగజారుతుండటం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్ లో నెలకొన్న మానవ సంక్షోభంపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం అన్ని దేశాలకు ఉందని చెప్పింది. రానున్న రోజుల్లో ఉక్రెయిన్ కు మరింత సాయాన్ని అందిస్తామని తెలిపింది. ఐక్యరాజ్యసమితిలో భారత రాయబారి టీఎస్ తిరుమూర్తి ఈ విషయాన్ని వెల్లడించారు. ఉక్రెయిన్ సంక్షోభాన్ని నివారించేందుకు పలు దేశాల విన్నపం మేరకు ఐక్యరాజ్యసమితి భద్రతామండలి అత్యవసరంగా భేటీ అయింది. 

ఈ సందర్భంగా తిరుమూర్తి మాట్లాడుతూ, యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్ లో పరిస్థితులు దిగజారుతున్నాయని చెప్పారు. వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది ఇతర దేశాలకు వలస వెళ్తున్నారని అన్నారు. ఆ దేశంలోని మానవతా పరిస్థితులపై భారత్ ఆవేదన వ్యక్తం చేస్తోందని చెప్పారు. ఆ దేశ పౌరులకు అందరూ మానవత్వంతో సాయం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ సమస్యను రష్యా, ఉక్రెయిన్ లు దౌత్య విధానాల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలని... అంతకు మించి మరో మార్గం లేదని చెప్పారు. ఈ విషయమై ఇరు దేశాలతో భారత ప్రధాని మోదీ మాట్లాడారని తెలిపారు. 

ఇప్పటి వరకు ఉక్రెయన్ నుంచి 22,500 మంది భారతీయులను వెనక్కి రప్పించామని తిరుమూర్తి చెప్పారు. మరో 18 దేశాలకు చెందిన ప్రజల తరలింపులో కూడా సాయం అందించామని తెలిపారు. దారుణ పరిస్థితులను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ పౌరుల కోసం ఇప్పటికే 90 టన్నులకు పైగా ఔషధాలు ఇతర సహాయ సామగ్రిని పంపించామని చెప్పారు.


More Telugu News