ఆస్ట్రేలియాపై భారీ స్కోరు సాధించిన భారత మహిళలు.. ఇక బౌలర్ల వంతు!

  • ఆసీస్‌కు 278 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన భారత్
  • అర్ధ సెంచరీలతో విరుచుకుపడిన మిథాలి, హర్మన్, యస్తిక
  • మూడు వికెట్లు పడగొట్టిన డార్సీ బ్రౌన్
మహిళల ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 277 పరుగులు సాధించి ప్రత్యర్థికి సవాల్ విసిరింది. టాప్-4లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత బ్యాటర్లు చెలరేగిపోయారు. 

ముఖ్యంగా భారీ స్కోర్లు సాధించడంలో విఫలమవుతూ వస్తున్న సారథి మిథాలీ రాజ్ 96 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 68 పరుగులు చేసింది. యస్తికా భాటియా 59 పరుగులు చేయగా, చివర్లో హర్మన్‌ప్రీత్ కౌర్, పూజా వస్త్రాకర్ ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. హర్మన్ 47 బంతుల్లో ఆరు ఫోర్లతో 57 పరుగులు చేయగా, పూజ 28 బంతుల్లో ఫోర్, రెండు సిక్సర్లతో 34 పరుగులు చేసింది. వీరి దెబ్బకు స్కోరు పరుగులు తీసి 277 వద్ద ఆగింది. 

ఇక ఆసీస్ బౌలర్లలో డార్సీ బ్రౌన్ మూడు వికెట్లు పడగొట్టగా, అలనా కింగ్ రెండు, జెస్ జోనాసెన్‌కు ఓ వికెట్ దక్కింది. మెరుగైన రన్‌రేట్ కలిగిన భారత జట్టు ఈ మ్యాచ్‌లో గెలిస్తే టాప్-3కి చేరుకుంటుంది.


More Telugu News