ఓడి గెలిచిన లక్ష్యసేన్ .. ప్రధాని మోదీ, సచిన్ అభినందనలు

  • ధైర్యంగా పోరాడావు
  • స్ఫూర్తినిచ్చేలా ఆడావు
  • భవిష్యత్తు ప్రయత్నాలకు అభినందనలన్న ప్రధాని
  • ఓటములన్నవే లేవంటూ సచిన్ ట్వీట్
బ్యాడ్మింటన్ భారత యువ స్టార్.. లక్ష్య సేన్ (20) ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో ఓటమి పాలైనా.. మంచి ప్రతిభ చూపించి ప్రధాని మోదీ, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ అభినందనలు అందుకున్నాడు. ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ 2022 చాంపియన్ షిప్ పోటీ ఫైనల్ కు దూసుకెళ్లి సంచలనం సృష్టించిన ఈ యువతేజం.. చివరిగా ఓడి రన్నరప్ గా నిలిచాడు.

ఓడినా అతడు చరిత్ర రికార్డుల్లో తన పేరును నమోదు చేసుకున్నాడు. ఎందుకంటే ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఫైనల్ చేరుకున్న ఐదో భారత షట్లర్ గా గుర్తింపు సంపాదించాడు. ఒలింపిక్ చాంపియన్ విక్టర్ అక్సెల్సెన్‌ తో ఆదివారం జరిగిన ఫైనల్ లో లక్ష్యసేన్ ఓటమి చవి చూశాడు. అతడు చూపించిన ప్రతిభను మెచ్చుకుంటూ ప్రధాని ట్వీట్ చేశారు. 

‘‘లక్ష్యసేన్ నిన్ను చూసి గర్విస్తున్నా. నీవు అద్భుతమైన మనోస్థైర్యాన్ని, దృఢత్వాన్ని చూపించావు. స్ఫూర్తినిచ్చేలా పోరాడావు. నీ భవిష్యత్తు ప్రయత్నాలకు నా అభినందనలు. నీవు నూతన విజయ శిఖరాలను అధిరోహిస్తావన్న నమ్మకం నాకు ఉంది’’ అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

మరోవైపు సచిన్ సైతం స్పందిస్తూ.. ‘‘జీవితంలో ఓటములు అన్నవే లేవు. అయితే విజయం. లేదంటే పాఠమే. నీవు ఈ అద్భుతమైన అనుభవం నుంచి ఎంతో నేర్చుకుని ఉంటావని ఆశిస్తున్నాను. రానున్న టోర్నమెంట్లలో విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అంటూ ట్వీట్ చేశారు.


More Telugu News