కేసీఆర్ తో నాకు ఎలాంటి విభేదాల్లేవు.. రేవంత్ రెడ్డితోనే నా పంచాయితీ: జగ్గారెడ్డి

  • ఇది కాంగ్రెస్ పార్టీ గొడవ కాదు
  • రేవంత్ తో పనిచేసేందుకు అభ్యంతరం లేదు
  • మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా విలువివ్వరా?
  • నిజాలు మాట్లాడడమే తన నైజమన్న జగ్గారెడ్డి  
సీఎం కేసీఆర్ తో తనకు రాజకీయంగా ఎలాంటి విభేదాల్లేవని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో కలిసి పనిచేసేందుకు తనకెలాంటి అభ్యంతరం లేదన్నారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నియమించిన ఏ వ్యక్తితోనైనా పనిచేసేందుకు తాను సిద్ధమేనన్నారు. పార్టీలోని కొందరు వ్యక్తులు కావాలనే తన పరువును చెడగొడుతున్నారని ఆయన ఆరోపించారు. 

తాను నిర్భయంగా నిజాలు మాట్లాడుతానని, అదే తన నైజమని చెప్పారు. ఇది కాంగ్రెస్ పార్టీలో పంచాయితీ కాదని, రేవంత్ తోనే తనకు పంచాయితీ అని తేల్చి చెప్పారు. మెదక్ పర్యటనకు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి తనను పిలువలేదని, దీంతో తనకు చాలా కోపం వచ్చిందని మండిపడ్డారు. పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తో వ్యవహరించే తీరు ఇదేనా? అని ప్రశ్నించారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసినా పార్టీలో విలువ ఇవ్వరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అసలు ఎలాంటి చెడు ఆలోచనలూ లేని ఎమ్మెల్యే శ్రీధర్ బాబుపైనా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సోనియా గాంధీ కుటుంబం వల్లే పార్టీకి గొప్ప పేరు వచ్చిందన్నారు. కాంగ్రెస్ తోనే ఎవరికైనా మేలు జరుగుతుందని చెప్పారు. పార్టీపై ఉన్న అభిమానంతోనే ఇంకా కొనసాగుతున్నానని జగ్గారెడ్డి పేర్కొన్నారు.


More Telugu News