అఖిలేశ్ బాట‌లోనే అజాం ఖాన్‌.. ఎంపీ పదవికి రాజీనామా

  • లోక్ స‌భ‌లో ఎస్పీకి ఐదుగురు ఎంపీలు
  • అఖిలేశ్‌, అజాం రాజీనామాతో 3కు త‌గ్గిన బ‌లం
  • ఎస్పీ గుర్తే క‌లిగిన టీడీపీకీ లోక్ స‌భ‌లో ముగ్గురు ఎంపీలే
ఉత్త‌రప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లు ఆ రాష్ట్రానికి చెందిన కీల‌క రాజకీయ పార్టీ స‌మాజ్ వాదీ పార్టీ వ్యూహాల్లో భారీ మార్పుల‌నే తీసుకొచ్చింద‌ని చెప్పాలి. దేశ రాజ‌కీయాల‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేయ‌గ‌లిగిన రాష్ట్రంగా ఉన్న యూపీలో ఉంటే అధికార ప‌క్షంగా, లేదంటే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా కొన‌సాగుతూ వ‌స్తున్న స‌మాజ్ వాదీ పార్టీ.. దేశ రాజ‌కీయాల్లోనూ కీల‌క భూమిక పోషించింది. అయితే తాజా యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఆ పార్టీ రాజ‌కీయ దృక్ప‌థాన్ని పూర్తిగా మార్చేశాయ‌న్న‌ వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విక్ట‌రీ కొట్టేస్తామ‌న్న ధీమాతో ఎంపీలుగా కొన‌సాగుతున్నా.. ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాద‌వ్‌తో పాటు ఆ పార్టీ కీల‌క నేత అజాం ఖాన్ కూడా అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలోనూ నిలిచారు. పార్టీ ఓట‌మిపాలైనా.. వీరిద్ద‌రూ ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఈ క్ర‌మంలో ఎంపీ ప‌ద‌వికో, ఎమ్మెల్యే ప‌ద‌వికో వీరు రాజీనామా చేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఈ క్ర‌మంలో మంగ‌ళ‌వారం అఖిలేశ్ త‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఆ వెంట‌నే అజాం ఖాన్ కూడా త‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేశారు. వీరిద్ద‌రూ యూపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా కొన‌సాగేందుకు నిర్ణ‌యించుకున్నారు.

ఈ దిశ‌గా ఎస్పీ తీసుకున్న నిర్ణ‌యంతో లోక్ స‌భ‌లో ఆ పార్టీ బ‌లం 5 నుంచి 3కు ప‌డిపోయింది. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎస్పీ త‌ర‌ఫున ఐదుగురు ఎంపీలు గెలిచారు. వారిలో ఇప్పుడు అఖిలేశ్‌, అజాం ఖాన్‌లు ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేయ‌డంతో లోక్ స‌భ‌లో ఆ పార్టీకి ఇక ముగ్గురు ఎంపీలు మాత్ర‌మే మిగిలారు. 

ఇదిలా ఉంటే.. ఎస్పీ గుర్తు అయిన సైకిల్ గుర్తుతోనే ఎన్నిక‌ల బరిలో నిలుస్తూ వ‌స్తున్న తెలుగు నేల‌కు చెందిన టీడీపీకి కూడా ఇప్పుడు లోక్ స‌భ‌లో ముగ్గురు ఎంపీలు మాత్ర‌మే ఉన్న సంగ‌తి తెలిసిందే. అంటే.. సైకిల్ గుర్తు క‌లిగిన టీడీపీ, ఎస్పీ పార్టీల బ‌లం లోక్ స‌భ‌లో స‌రిసమానంగా ఉంద‌న్న మాట‌.


More Telugu News