ధోనీ నిర్ణయాన్ని బాహుబలి-2లో ప్రభాస్ నిర్ణయంతో పోల్చిన టీమిండియా మాజీ క్రికెటర్

  • మార్చి 26 నుంచి ఐపీఎల్
  • ధోనీ సంచలన నిర్ణయం
  • సీఎస్కే కొత్త కెప్టెన్ గా రవీంద్ర జడేజా
  • బాహుబలి-2 వీడియో పంచుకున్న వసీం జాఫర్
ఎల్లుండి (మార్చి 26) ఐపీఎల్ తాజా సీజన్ ప్రారంభం కానుండగా, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్ ధోనీ తప్పుకోవడం క్రికెట్ వర్గాల్లో సంచలనం సృష్టించింది. గత సీజన్ లో జట్టును విజయపథంలో నడిపిన ధోనీ... ఈసారి భారత్ లోనే జరిగే ఐపీఎల్ లో ఇంకెంత బాగా జట్టును నడిపిస్తాడోనని అందరూ ఆశించారు. అయితే అనూహ్య రీతిలో ధోనీ కెప్టెన్సీ పగ్గాలను రవీంద్ర జడేజాకు అందించి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. 

కాగా, ధోనీ నిర్ణయంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ దీనిపై తనదైన శైలిలో స్పందించాడు. ధోనీ నిర్ణయాన్ని బాహుబలి-2లో అమరేంద్ర బాహుబలి పాత్రలో ప్రభాస్ తీసుకున్న నిర్ణయంతో పోల్చాడు. మహిష్మతి రాజ్యాన్ని వదులుకుని ఓ సామాన్యుడిలా అమరేంద్ర బాహుబలి వెళ్లిపోతాడు. ఇప్పుడు ధోనీ నిర్ణయం కూడా అలాగే ఉందని జాఫర్ ట్విట్టర్ లో పేర్కొన్నాడు. అంతేకాదు, బాహుబలి-2లో ప్రభాస్ రాజ్య త్యాగం చేసే సన్నివేశం తాలూకు వీడియో క్లిప్పింగ్ ను కూడా పంచుకున్నాడు. ధోనీ కెప్టెన్సీ వదులుకుంటున్నాడని, ఇకపై ఓ ఆటగాడిగానే చెన్నై జట్టులో కొనసాగనున్నాడని జాఫర్ వెల్లడించాడు. 

శనివారం జరిగే ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది.


More Telugu News