మూడు రాజధానులు కావాలనుకుంటే.. 175 జిల్లాలు చేయండి: నారా లోకేశ్

  • మూడేళ్లలో ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేకపోయారు
  • ఉద్యోగాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉంది
  • ప్రజల దృష్టిని మరల్చడానికే కొత్త జిల్లాలను తెరపైకి తెచ్చారన్న లోకేశ్ 
అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ మళ్లీ మూడు రాజధానులపై చర్చించిన విషయం తెలిసిందే. చర్చ సందర్భంగా మంత్రులు కోర్టుల గురించి చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేత నారా లోకేశ్ తప్పుపట్టారు. చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదంటూ కేవలం మూడు రాజధానులను ఉద్దేశించి మాత్రమే హైకోర్టు చెప్పిందని అన్నారు. 

ఒకవేళ వైసీపీకి నిజంగా మూడు రాజధానులు కావాలనుకుంటే... రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలను 175 జిల్లాలుగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ మంత్రివర్గంలో 90 శాతం మంది పదో తరగతి ఫెయిల్ అయిన వారు ఉన్నారని ఎద్దేవా చేశారు. 

మూడేళ్లలో ఏపీకి ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేదని... ఇప్పుడు జిల్లాలను విభజించినంత మాత్రాన అభివృద్ధి జరుగుతుందా? అని లోకేశ్ ప్రశ్నించారు. తెలంగాణకు పరిశ్రమలు వస్తుంటే... ఏపీకి మాత్రం ఒక్క పరిశ్రమ కూడా రానటువంటి దారుణ పరిస్థితి నెలకొందని అన్నారు. 

పరిశ్రమలను రప్పించలేని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని... దీన్నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు. కొత్త జిల్లాల వల్ల ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. కొత్తగా ఒక్క ఉద్యోగమైనా వస్తుందా? అని అడిగారు.


More Telugu News