ఇక ఒకే రాజధాని నినాదం అంతులేని వ్యథగా మిగిలిపోయినట్టే: విజ‌యసాయిరెడ్డి

  • అన్ని ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
  • మూడు రాజధానుల అభివృద్ధి కొనసాగుతుందని జగన్ గారు చెప్పారు
  • అసెంబ్లీలో చేసిన ప్రకటన పచ్చ బ్యాచ్‌ గుండెల్లో గునపంలా దిగి ఉంటుంది
  • పేల్చిన టపాసులు, పంచిన మిఠాయిల ఖర్చులు వేస్ట్‌ అయ్యాయన్న విజయసాయి 
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మూడు రాజధానుల అంశంపై నిన్న అసెంబ్లీలో స్వల్ప కాలిక చర్చ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సీఎం జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ప్ర‌స్తావిస్తూ టీడీపీ నేత‌ల‌పై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు. 

'అన్ని ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. మూడు రాజధానుల అభివృద్ధి కొనసాగుతుందని జగన్ గారు అసెంబ్లీలో చేసిన ప్రకటన పచ్చ బ్యాచ్‌ గుండెల్లో గునపంలా దిగి ఉంటుంది. పేల్చిన టపాసులు, పంచిన మిఠాయిల ఖర్చులు వేస్ట్‌ అయ్యాయి. ఒకే రాజధాని నినాదం అంతులేని వ్యథగా మిగిలిపోయినట్టే' అని విజ‌యసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.  

సారాపై విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో చంద్ర‌బాబు, మీడియాపై కూడా విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్‌లో స్పందిస్తూ ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. 'చంద్రబాబు, భజన మీడియా కాలంచెల్లిన మైండ్‌సెట్‌తో అక్కడే గిరికీలు కొడుతున్నారు. '2004లో ‘అలిపిరి దాడి’పై ఆశ పెట్టుకుంటే ఏం జరిగింది? 2019లో పసుపు, కుంకుమలే రంగు వెలిసిపోయేలా చేశాయి. దొంగ తానే అయినా కెలికి మరీ లిక్కర్ బ్రాండ్ల లోగుట్టు బైట పెట్టించుకున్నారు. దిక్కు తోచడం లేదు పాపం' అని విజ‌య‌సాయిరెడ్డి ఎద్దేవా చేశారు. 



More Telugu News