సమయం వృథా చేసినందుకు.. కేన్ విలియమ్సన్ కు రూ.12 లక్షల జరిమానా
- నిర్దేశిత సమయంలోపు ముగించని బౌలింగ్
- దీంతో జరిమానా విధింపు
- ప్రకటించిన ఐపీఎల్ పాలకమండలి
కేన్ విలియమ్సన్ కు ఐపీఎల్ 2022 ఆరంభ మ్యాచ్ లో ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఒకవైపు రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఘోరంగా ఓడిపోగా, మరోవైపు స్లో ఓవర్ బౌలింగ్ రేటుతో జరిమానా కట్టాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాడు.
పూణెలోని ఎంసీఏ స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 61 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్ లో నిదానంగా బౌలింగ్ చేయడం ద్వారా, నిర్దేశించిన కాల పరిమితిలోపు ముగించనందుకు గాను సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కు రూ.12 లక్షల జరిమానా విధిస్తున్నట్టు ఐపీఎల్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి కింద కనీస ఓవర్ రేటును పాటించే విషయంలో ఐపీఎల్ 2022 సీజన్ లో సన్ రైజర్స్ కు ఇది తొలి తప్పిదంగా పేర్కొంది.
మరోపక్క, నోబాల్స్ విషయంలో కేన్ విలియమ్సన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇది తమకు సాధారణ విషయం కాదన్నాడు. ఎక్కడ మెరుగుపరుచుకోవాలో దృష్టి పెట్టాల్సి ఉందని అంగీకరించాడు.