శ్రీదేవి బయోపిక్ తీయకపోవడానికి ఇదే కారణం: రామ్ గోపాల్ వర్మ

  • శ్రీదేవి లాంటి హీరోయిన్ కనిపించలేదు
  • శశికళ బయోపిక్ తీసే అవకాశం లేకపోలేదు
  • ఇద్దరు అమ్మాయిలు లెస్బియన్స్ గా ఎందుకు మారారనేదే 'డేంజరస్' చిత్రం
సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు అతిలోక సుందరి శ్రీదేవి అంటే ఎంత అభిమానమో అందరికీ తెలిసిందే. తన జీవితంలో శ్రీదేవిని ఇష్టపడినంత ఎక్కువగా మరెవరినీ ఆయన ఇష్టపడలేదు. ఈ విషయాన్ని ఆయన ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పారు. తాజాగా వర్మ మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. 

దివంగత శ్రీదేవి బయోపిక్ ను తెరకెక్కించాలనేది తన కోరిక అని వర్మ తెలిపారు. అయితే, శ్రీదేవి పాత్రను పోషించడానికి అలాంటి హీరోయిన్ కనిపించడం లేదని... అందుకే ఆ ప్రాజెక్టును విరమించుకున్నానని చెప్పారు. జయలలిత స్నేహితురాలు శశికళ బయోపిక్ కూడా తీయాలనుకుంటున్నానని... ఆ ప్రాజెక్టుకు బ్రేక్ పడినప్పటికీ, మళ్లీ ప్రారంభించే అవకాశం లేకపోలేదని తెలిపారు. 

మరో వైపు వర్మ తాజా చిత్రం 'డేంజరస్ (మా ఇష్టం)' విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో అప్సర రాణి, నైనా గంగూలీలు లెస్బియన్స్ గా నటించారు. ఈ సినిమా గురించి వర్మ మాట్లాడుతూ, స్వలింగ సంపర్కులను మనం చాలా చులకనగా చూస్తామని... ప్రభుత్వాలు, న్యాయస్థానాలు వారికి అనుమతిని ఇచ్చినా మన దృష్టి కోణం మాత్రం మారడం లేదని అన్నారు. 

ఇద్దరు అమ్మాయిలు లెస్బియన్స్ గా ఎందుకు మారారు? వారిని సమాజం ఎలా చూస్తుంది? అనే అంశాలతో సినిమాను తెరకెక్కించామని చెప్పారు. ఈ చిత్రంలో నటించేందుకు తొలుత నైనా గంగూలీ ఒప్పుకోలేదని... షూటింగ్ సమయంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని వర్మ తెలిపారు. ఈ పాత్రల్లో నటించేందుకు ముందుకొచ్చిన ఇద్దరు హీరోయిన్లను అభినందిస్తున్నానని చెప్పారు.


More Telugu News