ఈశాన్యంలో కాంగ్రెస్ కనుమరుగు!.. 4 రాజ్యసభ సీట్లు ఎన్డీయే ఖాతాలోకే

  • తాజా ఎన్నికల్లో నాలుగింటిలోనూ విజయం
  • ఈశాన్య రాష్ట్రాలకు రాజ్యసభలో 14 స్థానాలు
  • ఎన్డీయే ఖాతాలో 13.. ఒకటి స్వతంత్ర అభ్యర్థి చేతిలో
ఈశాన్య భారత్ లో నాలుగు రాజ్యసభ స్థానాలను ఎన్డీయే సొంతం చేసుకుంది. బీజేపీ ఖాతాలోకి మూడు వెళ్లగా, ఒకటి భాగస్వామ్య పక్షం గెలుచుకుంది. దీంతో పెద్దల సభలో ఈశాన్య రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం కరవైంది. పార్లమెంటరీ చరిత్రలో కాంగ్రెస్ కు ఈ పరిస్థితి ఎదురుకావడం ఇదే మొదటిసారి. త్రిపుర, నాగాలాండ్ బీజేపీ ఖాతాలోకి చేరిపోయాయి. పోటీ లేకుండానే నాగాలాండ్ ను బీజేపీ సొంతం చేసుకుంది. త్రిపుర స్థానాన్ని సీపీఎం కోల్పోయింది. 

అసోమ్ లో రెండు స్థానాల్లో బీజేపీ ఒకటి, ఎన్డీయే భాగస్వామి యూపీపీఎల్ ఒకటి గెలుచుకున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేల నుంచి ఏడు ఓట్లు సంపాదించామని అసోమ్ ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ప్రకటించారు. 126 సభ్యుల అసోమ్ అసెంబ్లీలో బీజేపీ, దాని మిత్ర పక్షాలకు నాలుగు ఓట్లు తగ్గగా ప్రతిపక్షాల నుంచి ఓట్లు రావడం కలిసొచ్చింది. తాజా ఎన్నికల అనంతరం ఈశాన్య రాష్ట్రాల తరఫున రాజ్యసభలో మొత్తం 14 స్థానాలకు గాను ఎన్డీయే చేతిలో 13 ఉండగా, మరొక స్థానానికి స్వతంత్ర అభ్యర్థి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.


More Telugu News