చంద్రబాబు చేయలేని పనిని నేను చేశా: జగన్

  • కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు
  • స్థానిక ఎమ్మెల్యే విన్నపం మేరకు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశామన్న సీఎం
  • 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఆ పని చేయలేకపోయారని ఎద్దేవా
ఏపీలో 26 కొత్త జిల్లాలు ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి కొత్త జిల్లాలను వర్చువల్ గా ఆయన ప్రారంభించారు. వీటితో కొత్త రెవెన్యూ డివిజన్లను కూడా ఆయన ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని రెవెన్యూ డివిజన్ల సంఖ్య 72కి చేరుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గం కుప్పంను కూడా రెవెన్యూ డివిజన్ గా చేశారు. 

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, కుప్పం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుప్పం ఎమ్మెల్యే (చంద్రబాబు) విన్నపం మేరకు రెవెన్యూ డివిజన్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. చంద్రబాబు 14 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నప్పటికీ కుప్పంను రెవెన్యూ డివిజన్ గా చేసుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. ఆ పని తాము చేశామని చెప్పారు. 

రాష్ట్రంలో కొత్తగా 21 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేశామని జగన్ తెలిపారు. పాలన వికేంద్రీకరణ ప్రజలకు మేలు చేస్తుందని అన్నారు. ప్రజల విన్నపాల మేరకు కొన్ని జిల్లాల్లో మార్పులు చేశామని తెలిపారు. 12 నియోజకవర్గాల్లో మండలాలను వేరు చేసి రెండు జిల్లాల్లో పెట్టాల్సి వచ్చిందని చెప్పారు. ఈ రోజు నుంచి కొత్త కార్యాలయాల ద్వారానే సేవలు కొనసాగుతాయని... ఉద్యోగులు కొత్త కార్యాలయాల నుంచే విధులు నిర్వహిస్తారని తెలిపారు.


More Telugu News