శ్రీకాకుళం జిల్లాలో నెత్తురోడిన రైలు పట్టాలు... ఐదుగురి మృతి

  • శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం
  • సిల్చార్ ఎక్స్ ప్రెస్ లో పొగలు
  • చైన్ లాగిన ప్రయాణికులు
  • కిందికి దిగి పట్టాలు దాటే క్రమంలో ఢీకొట్టిన కోణార్క్ 
శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. జిల్లాలోని జి.సిగడాం వద్ద బాతువ గ్రామం సమీపంలో గతరాత్రి కోయంబత్తూరు-సిల్చార్ ఎక్స్ ప్రెస్ రైలు నిలిచిపోయింది. జనరల్ బోగీలో పొగలు రావడంతో ప్రయాణికులు అత్యవసర చెయిన్ లాగారు. 

రైలు ఆగడంతో ప్రయాణికులు కిందికి దిగారు. కొందరు అవతలివైపు ఉన్న పట్టాలు దాటే క్రమంలో, అదే సమయంలో దూసుకొచ్చిన కోణార్క్ ఎక్స్ ప్రెస్ రైలును గమనించలేదు. దాంతో రైలు పట్టాలు దాటుతున్న వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడడంతో శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించారు. కాగా, మరణించినవారు అసోంకు చెందినవారిగా గుర్తించారు. 

అయితే, ఈ ప్రమాదంపై అధికారుల కథనం మరోలా ఉంది. ప్రయాణికులు బోగీలో ఎలాంటి పొగ రాకుండానే ఉద్దేశపూర్వకంగా చెయిన్ లాగారని ఆరోపిస్తున్నారు. రైల్వే అధికారులకు దొరికిపోతామన్న కంగారులో పట్టాలు దాటుతుండగా వారిని కోణార్క్ ఎక్స్ ప్రెస్ ఢీకొందని వివరించారు.


More Telugu News