కటిక కులస్తులు నిర్వహించాల్సిన మాంసం దుకాణాలను ఎవరు నిర్వహిస్తున్నారు?: కేసీఆర్ కు బండి సంజయ్ ప్రశ్న

  • ఓబీసీ వ్యక్తిని ప్రజలు ప్రధానిని చేశారన్న సంజయ్ 
  • ఎన్నికలప్పుడే కేసీఆర్ కు బీసీ, ఎస్సీ, ఎస్టీలు గుర్తుకొస్తారని విమర్శ 
  • మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని స్పష్టీకరణ 
ఓబీసీల పట్ల కేసీఆర్ ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు పోవాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హైదరాబాదులోని ఆర్టీసీ కల్యాణ మండపంలో నేడు జరిగిన బీసీ విద్యావంతుల సదస్సులో పాల్గొన్న సంజయ్ మాట్లాడుతూ ఆ విధంగా అన్నారు. ఓబీసీకి చెందిన వ్యక్తి నరేంద్ర మోదీ గుజరాత్ ను అభివృద్ధి చేశారని... దీంతో ఆయనను దేశ ప్రజలు ప్రధానమంత్రిని చేశారని చెప్పారు. మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఓబీసీలకు అనుకూలమని అన్నారు. బీసీ కమిషన్ కు జాతీయ హోదా కల్పించింది బీజేపీనే అని చెప్పారు. 

ఎన్నికలు వస్తేనే కేసీఆర్ కు బీసీ, ఎస్సీ, ఎస్టీలు గుర్తుకొస్తారని బండి సంజయ్ మండిపడ్డారు. తెలంగాణ మేధావులు మౌనంగా ఉన్నారని.. వారు గళం విప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎంబీసీ కార్పొరేషన్ కు కేసీఆర్ కనీసం రూ. 10 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని విమర్శించారు. బీజేపీ మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకమని చెప్పారు.

కటిక కులస్తులు నిర్వహించాల్సిన  మాంసం దుకాణాలను ఎవరు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. ముస్లింల పేర్లతో మటన్ షాపులు నడుస్తున్నాయని చెప్పారు. ఫ్యాన్సీ స్టోర్లు, బంగారం దుకాణాలను కూడా ముస్లింలు నిర్వహిస్తున్నారని అన్నారు. దీని వల్ల బీసీలకు తీరని నష్టం జరుగుతోందని చెప్పారు.


More Telugu News