మూవీ రివ్యూ : 'బీస్ట్'

  • ఈ రోజునే విడుదలైన 'బీస్ట్'
  • యాక్షన్ ప్రధానంగా నడిచే కథ 
  • జంటగా నటించిన విజయ్, పూజ హెగ్డే
  • దర్శకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ 
విజయ్ కి తమిళనాట మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది. ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన స్టయిల్ ఉంది. ఆ స్టయిల్ ఆయన అభిమానులను మరింతగా ప్రభావితం చేస్తుంటుంది. 60కి పైగా సినిమాలను పూర్తిచేసిన ఆయన, స్టార్ హీరోగా ఒక రేంజ్ లో బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులను నమోదు చేస్తూ వెళుతున్నాడు. ఆయనతో సినిమాలు చేయడానికి సీనియర్ స్టార్ డైరెక్టర్లు పోటీపడుతుంటారు. అలాంటి విజయ్ ఇంతకుముందు రెండు సినిమాలు మాత్రమే చేసిన నెల్సన్ దిలీప్ కుమార్ కి ఛాన్స్ ఇచ్చి, ఆయన దర్శకత్వంలో 'బీస్ట్' చేయడం విశేషం. 
 
అంతగా నెల్సన్ దిలీప్ కుమార్ .. హీరో విజయ్ కి చెప్పిన కథ ఏమిటి? వెంటనే విజయ్ అంగీకరించేంత ట్విస్టులు ఇందులో ఏమున్నాయి? అనేది ఇప్పుడు చూద్దాం. కథగా చెప్పుకుంటే .. వీర రాఘవ (విజయ్) 'రా' ఏజెంట్ గా పనిచేస్తుంటాడు. ఒమర్ ఫరూక్ అనే ఒక తీవ్రవాద నాయకుడిని పట్టుకోవడానికి వీరరాఘవ ఒక ప్లాన్ చేసుకుంటాడు. అతణ్ణి పట్టుకుని ప్రభుత్వానికి అప్పగిస్తాడు. అయితే ఈ ఆపరేషన్లో ఒక చిన్నపిల్ల చనిపోవడంతో, అతని మనసుకి కష్టం కలగడంతో 'రా' నుంచి బయటికి వెళ్లిపోతాడు.

ఓ ఫంక్షన్ కి వెళ్లిన వీరరాఘవకి అక్కడ ప్రీతి (పూజ హెగ్డే) తారసపడుతుంది. అక్కడ వాళ్లద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారుతుంది. ఆల్రెడీ తనకి ఎంగేజ్మెంట్ జరిగిన వ్యక్తిని వదిలించుకోవాలని ప్రీతి ట్రై చేస్తూ ఉంటుంది. తనకి వీరరాఘవ మరింత దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో తన ఆఫీస్ లోనే అతనికి ఉద్యోగం ఇప్పించాలనుకుంటుంది. ప్రీతిని తనకి కాకుండా చేస్తున్న వీరరాఘవపై ఎటాక్ చేయడానికిగాను, ఆమెతో ఎంగేజ్మెంట్ జరిగిన వ్యక్తి కిరాయి రౌడీలను లైన్లో పెడతాడు. అందరూ కూడా ఒక మాల్ కి చేరుకుంటారు. ఆ సమయంలోనే ఆ మాల్ టెర్రరిస్ట్ చేతుల్లోకి వెళుతుంది.

  ఆ మాల్ లోని  250 మంది కూడా తీవ్రవాదుల చేతిలో బందీలవుతారు. తీహార్ జైల్లో ఉన్న 'ఒమర్ ఫరూక్' ను విడుదల చేయాలనేదే తీవ్రవాదుల డిమాండ్. అలా చేయని పక్షంలో మాల్ లోని వాళ్లందరినీ అంతం చేస్తామని హెచ్చరిస్తారు. అప్పుడు ఆ మాల్ లోనే ఉన్న వీరరాఘవ ఆ తీవ్రవాదులను ఎలా ఎదుర్కున్నాడు? అనే ఆసక్తికరమైన .. అనూహ్యమైన  మలుపులతో .. యాక్షన్ సన్నివేశాలే ప్రధానమైన బలంగా మిగతా కథ పరుగులు తీస్తుంది. కథగా చెప్పుకుంటే కొత్తదనం ఏ కోశానా కనిపించదు. కానీ విజయ్ చేసే మేజిక్ వలన ఎక్కడా బోర్ కొట్టకుండా నడుస్తుంది.

ఇటు హీరో ఇంట్రడక్షన్ సీన్ గానీ .. అటు పూజ హెగ్డే ఇంట్రడక్షన్ గాని ఎలాంటి హడావిడి లేకుండా చాలా సాదాసీదాగా జరిగిపోతుంది. ఇక హీరోకి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. ఒక చిన్నపాప కారణంగా 'రా' నుంచి దూరమైన హీరో, మరో చిన్నపాప కారణంగా 'రా' ఏజెంట్ తరహాలోనే ఆపరేషన్ లోకి దిగుతాడు. కథలో ఈ పాయింట్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది .. ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అవుతుంది. కథ చాలా వరకూ షాపింగ్ మాల్ చుట్టూ తిరుగుతుంది. అయినా బోర్ కొట్టకుండా యాక్షన్ ను .. కామెడీని .. డ్రామాను కలిపి నడిపిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో నెల్సన్ చాలావరకూ సక్సెస్ అయ్యాడు.

విజయ్ లోని హీరోయిజాన్ని .. విలన్ గ్యాంగ్ లోని ఒక రౌడీ చేయి నరకడం మొదలుపెట్టి యుద్ధ విమానాల వరకూ తీసుకుని వెళ్లాడు. ఒక ఫైట్ లో విజయ్ తన అరచేతిలో గుచ్చుకున్న చిన్న గాజుముక్కని నోటితో లాగేసి నాలుకతో ఊదేసే సీన్ మొదలు, ఆయన మార్కు స్టయిల్ ను చూపించే అవకాశాలను నెల్సన్ ఎంతమాత్రం వదులుకోలేదు. ఇక ఇంతకుముందు ఏ సినిమాలో లేనంత గ్లామరస్ గా ఈ సినిమాలో ఆయన పూజ హెగ్డేను చూపించాడు. అయితే ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేగానీ .. ఔరా! అనిపించే ట్విస్టులు గాని కనిపించవు. ఇక విజయ్ ఎదురుగా నిలబడి పోరాడే ఒక బలమైన విలన్ లేకపోవడం మైనస్ గానే కనిపిస్తుంది. 

విజయ్ - పూజ జోడీ తెరపై అదిరింది. అయితే ఇద్దరికీ కూడా రొమాన్స్ కి టైమ్ ఇవ్వలేదు. హాయిగా పాడుకునేందుకు అవసరమైన సమయం వాళ్లకి దక్కలేదు. ఇటు హీరోకుగానీ ..  అటు హీరోయిన్ కి గాని ఒక  ఫ్యామిలీ అనేది ఉండదు. ఏదో గాలివాటుకు కలుసుకుని .. కలిసి తిరిగేస్తుంటారు అంతే. ఇక కథ మొదలవుతూ ఉండగానే ఆయా ప్రాంతాల పేర్లు స్క్రీన్ పై వేస్తూ లొకేషన్స్ మార్చేస్తూ వెళ్లారు. స్క్రీన్ మూలన పడే ఆ సీజీ చూడకపోతే, కథ ఎక్కడ జరుగుతున్నదీ అర్థం కాదు. అలాగే కొన్ని చోట్ల హిందీ డైలాగ్స్ సమయంలోను తెలుగు సీజీ వేయలేదు.

ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా విడుదలకి ముందే అరబిక్ కుతు సాంగ్ పాప్యులర్ అయింది. ఇక థియేటర్లో ఈ సాంగ్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. బీట్ .. జానీ మాస్టర్  కొరియోగ్రఫీ .. కాస్ట్యూమ్స్ .. కలర్ ఫుల్ సెట్ ..  డిఫరెంట్  లుక్స్ తో కూడిన డాన్సర్లతో ఈ పాట సాగుతుంది. ఈ పాట వస్తుంటే తెరపై ఎక్కడ చూడాలో అర్థం కాదు. అంతగా తెరను ఏ వైపు వదలకుండా వాడుకోవడం జరిగింది. ఈ పాటలో విజయ్ ఎనర్జీ విజిల్స్ వేయించేలా ఉంటుంది. పూజ కూడా మరింత అందంగా మెరిసింది. 

ఇక తరువాత చెప్పుకోవలసింది మనోజ్ పరమహంస ఫొటోగ్రఫీని గురించి. ప్రతి సన్నివేశాన్ని అందంగా .. ఆసక్తికరంగా తెరపై ఆయన ఆవిష్కరించాడు. అన్బు అరివు కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకి హైలైట్. కథ టెన్షన్ తో నడుస్తూ ఉండగా .. చాలా సున్నితమైన హాస్యాన్ని పండించిన తీరు నవ్వులు పూయిస్తుంది. హనుమాన్ చౌదరి మాటలు సింపుల్ గా అనిపిస్తూనే హాయిగా నవ్విస్తాయి. సన్ పిక్చర్స్ వారి నిర్మాణ విలువలు ఎలా ఉంటాయనేది ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు.  

నిజానికి ఇది విజయ్ రేంజ్ కీ .. క్రేజ్ కి తగిన కథ కాదు. ఆయన స్థాయికి తగిన బలమైన తారాగణం కూడా లేదు. విజయ్ స్టయిల్ ను .. ఆయన ఎనర్జీని  .. ఆయన మేజిక్ ను పట్టుకుని శుభం కార్డు వరకూ లాక్కురావడానికి నెల్సన్ తనవంతు ప్రయత్నం చేశాడు. తీవ్రవాదనాయకుడు .. హోమ్ మినిష్టర్ .. ఆయన నాటకంలో ప్రధాన పాత్రధారి .. ఈ ముగ్గురు విలన్ లక్షణాలతో కనిపిస్తారు గానీ, మెయిన్ విలన్ గా ఎవరినీ నిలబెట్టకపోవడం అభిమానులకు కొంత అసంతృప్తిని కలిగిస్తుంది. 

విజయ్ స్టైల్ .. ఆయన మార్క్ మాస్ యాక్షన్ ను ఇష్టపడేవారిని మాత్రం ఈ సినిమా నిరాశ పరచదు. 'పోకిరి సినిమాలో 'ఒకసారి కమిట్  అయితే నా మాట నేనే వినను' అనే మహేశ్ డైలాగ్ బాగా పాప్యులర్. ఈ సినిమాలో విజయ్ డైలాగ్ అదే. ఈ డైలాగ్ పైనే ఇంటర్వెల్ బ్యాంగ్ పడటం .. ఈ డైలాగ్ పైనే అసలు కథకు ఎండ్ కార్డు పడటం కొసమెరుపు.

--- పెద్దింటి గోపీకృష్ణ


More Telugu News