చంద్రబాబు నాయుడి ధన దాహం వల్లే పోల‌వ‌రానికి ఈ ప‌రిస్థితి దాపురించింది: మంత్రి అంబ‌టి రాంబాబు

  • జల వనరుల శాఖ మంత్రిగా అంబటి రాంబాబు బాధ్యతల స్వీక‌ర‌ణ‌
  • ఏపీకి పోలవరం ముఖ్య‌మైన ప్రాజెక్ట్ అని వ్యాఖ్య‌
  • డయాఫ్రమ్ దెబ్బతిన్న సందర్భాలు ఏ ప్రాజెక్ట్‌లోనూ లేవని విమ‌ర్శ‌
  • పోల‌వ‌రంలో ఆ ప‌రిస్థితికి గత ప్రభుత్వ తప్పిదాలే కార‌ణ‌మ‌ని ఆరోప‌ణ‌
ఏపీ సచివాలయంలోని నాలుగవ బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో జల వనరుల శాఖ మంత్రిగా అంబటి రాంబాబు నేడు బాధ్యతలు చేపట్టారు. ఈ సంద‌ర్భంగా త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి పూజ‌లు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏపీకి పోలవరం ముఖ్య‌మైన ప్రాజెక్ట్ అని, అది ఏపీకి వరమ‌ని చెప్పారు. 

ఆ ప్రాజెక్టుతో రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. ఆ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడానికి కృషి చేస్తాన‌ని అన్నారు. ఆ ప్రాజెక్టును రీడిజైనింగ్ చేసే పరిస్థితులు ఎందుకు వచ్చాయని ఆయ‌న నిల‌దీశారు. డయాఫ్రమ్ దెబ్బతిన్న సందర్భాలు ఏ ప్రాజెక్ట్‌లోనూ లేవని, గత ప్రభుత్వ తప్పిదాలే ఈ ప‌రిస్థితుల‌కు కారణమ‌ని అంబటి రాంబాబు ఆరోపించారు.

డయాఫ్రమ్‌తో ఏర్పడిన నష్టాన్ని భర్తీ చేయడం కోసం దాదాపు రూ. 2,100 కోట్లు అవ‌స‌రం అవుతాయ‌ని నిపుణులు అంచనా వేశార‌ని చెప్పారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో స్పిల్ వే పూర్తి కాకుండానే డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని హడావుడిగా పూర్తి చేసి బిల్లులు డ్రా చేసేశారని ఆయ‌న ఆరోపించారు. నాటి సీఎం చంద్రబాబు నాయుడి ధన దాహం వల్లే ఈ ప‌రిస్థితి దాపురించింద‌ని విమ‌ర్శించారు. అలాగే, మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు కూడా దీనికి ‌కారణమ‌ని అంబటి రాంబాబు అన్నారు.

 కాగా, జలవనరుల శాఖ మంత్రిగా త‌న‌కు జ‌గ‌న్ మంచి అవకాశం ఇచ్చార‌ని, వైఎస్సార్ హయాంలో ప్రారంభమైన జలయజ్ఞాన్ని పూర్తి చేస్తానని అన్నారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న‌ అన్ని‌ ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తామ‌ని, ఏపీ రైతులకి నీరు అందించ‌డానికి కృషి చేస్తున్న జగన్ కు తామంతా అండ‌గా ఉంటామ‌ని అంబ‌టి రాంబాబు చెప్పారు.


More Telugu News