హద్దు మీరిన ప్రవర్తన.. పంత్, శార్దూల్, ఆమ్రేలపై ఐపీఎల్ చర్యలు

  • పంత్, ప్రవీణ్ ఆమ్రేలకు పూర్తి మ్యాచ్ ఫీజు కోత
  • శార్దూల్ ఠాకూర్ కు 50 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా
  • నిబంధనలు ఉల్లంఘించినట్టు ఐపీఎల్ ప్రకటన
‘నోబాల్’ ప్రకటించలేదని రచ్చ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ స్క్వాడ్ పై ఐపీఎల్ చర్యలు ప్రకటించింది. రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్ చివరి ఓవర్ లో వివాదం చెలరేగడం తెలిసిందే. 

మెక్ కాయ్ చివరి ఓవర్ బౌలింగ్ చేస్తున్నాడు. ఢిల్లీ గెలవాలంటే 6 బంతుల్లో 36 పరుగులు సాధించాలి. మొదటి మూడు బంతులను సిక్సర్లుగా రోవ్ మాన్ పావెల్ మలిచి విజయంపై ఆశలు రేకెత్తించాడు. మిగిలిన మూడు బంతులను మూడు సిక్సర్లుగా పావెల్ బాదేస్తే గెలిచిపోతామని ఢిల్లీ క్యాపిటల్స్ ఆశపడినట్టుంది. 

అప్పుడు నాలుగో బంతిని మెక్ కాయ్ ఫుల్ టాస్ గా వేశాడు. దీన్ని నో బాల్ గా ఇవ్వాలని ఢిల్లీ ఆటగాళ్లు అంపైర్ ను డిమాండ్ చేశారు. టీవీ అంపైర్ సాయం తీసుకోవాలని కోరారు. అయినా, ఫీల్డింగ్ అంపైర్ నోబాల్ గా ఇవ్వలేదు. అనుమతించిన ఎత్తు మేరకే బాల్ వెళ్లినట్టు తేల్చాడు. 

కానీ, డగౌట్ లో ఉన్న కెప్టెన్ రిషబ్ పంత్ కు ఇది నచ్చలేదు. క్రీజులోని ఆటగాళ్లను వెనక్కి రావాలంటూ సైగలతో కోరాడు. అంటే నిరసనగా వాకౌట్ చేయడమేనని అనుకోవాలి. ఆ తర్వాత ఢిల్లీ అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రే మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చి అంపైర్ కు నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. ఈ చర్యలను ఐపీఎల్ ప్రవర్తనా నియమావళికి వ్యతిరేకమని గుర్తించింది.

‘‘ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.7 కింద లెవల్ 2 నేరానికి పంత్ పాల్పడ్డాడు’’ అని ఐపీఎల్ నిర్ధారిస్తూ,  మొత్తం మ్యాచ్ ఫీజును జరిమానాగా కట్టాలని ఆదేశించింది. శార్దూల్ ఠాకూర్ ను మ్యాచ్ ఫీజులో 50 శాతం చెల్లించాలని ఆదేశించింది. ఐపీఎల్ చట్టంలోని ఆర్టికల్ 2.8 కింద లెవల్ 2 నేరానికి పాల్పడినట్టు ప్రకటించింది. ఆమ్రే సైతం నిబంధనలు ఉల్లంఘించినట్టు ప్రకటిస్తూ 100 శాతం మ్యాజ్ ఫీజు చెల్లించాలని ఆదేశించింది. ఒక మ్యాచ్ పై నిషేధం కూడా విధించింది.


More Telugu News