పుష్ప, కేజీఎఫ్‌-2, ఆర్‌ఆర్‌ఆర్ విజయాలు బాలీవుడ్‌ను భ‌య‌పెడుతున్నాయి: సినీ నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్

  • బాలీవుడ్‌కి చెందిన వారికి ఏం చేయాలో కూడా అర్థం కావ‌ట్లేద‌న్న మ‌నోజ్
  • బాలీవుడ్‌కు ద‌క్షిణాది సినీ ప‌రిశ్ర‌మ‌ గుణపాఠం నేర్పిందని వ్యాఖ్య‌
  • ఎంతో కొంత నేర్చుకోవాలని హిత‌వు
బాలీవుడ్ సినిమాలు వ‌ర్సెస్ ద‌క్షిణాది సినిమాలు అంటూ కొన్ని రోజులుగా ప‌లువురు సినీన‌టులు ట్వీట్లు చేస్తోన్న విష‌యం తెలిసిందే. తాజాగా ఇదే విష‌యంపై ప్రముఖ బాలీవుడ్ నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్  స్పందిస్తూ... ద‌క్షిణాది సినిమాలు పుష్ప, కేజీఎఫ్‌-2, ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాల‌ విజయాలు బాలీవుడ్‌ దర్శకుల‌ను, నిర్మాతలను భ‌య‌పెడుతున్నాయ‌ని చెప్పాడు. దీంతో బాలీవుడ్‌కి చెందిన వారికి ఏం చేయాలో కూడా అర్థం కావ‌ట్లేద‌ని అన్నాడు. ఒక రకంగా ఈ ప‌రిస్థితి రావ‌డం బాలీవుడ్‌కు గుణపాఠం నేర్పిందని చెప్పాడు. 

బాలీవుడ్ ఈ ప‌రిస్థితుల నుంచి ఎంతో కొంత నేర్చుకోవాలని అన్నాడు. ద‌క్షిణాది వారు సినిమా పట్ల ఎంతో ప్యాషన్‌తో పని చేస్తారని, ప్రతి సీన్‌ ప్రపంచంలోనే బెస్ట్‌ సీన్‌గా ఉండాలని కోరుకుంటార‌ని చెప్పాడు. పుష్ప, కేజీఎఫ్‌-2, ఆర్‌ఆర్‌ఆర్ వంటి సినిమాలు చూస్తే ఆ సినిమాల‌ను ఎటువంటి లోటుపాట్లు లేకుండా తీసిన‌ట్లు కనిపిస్తాయని చెప్పాడు. అటువంటి నిబ‌ద్ధ‌త బాలీవుడ్‌కి లేద‌ని అన్నాడు. బాలీవుడ్‌లో బాక్సాఫీస్‌ కలెక్షన్ల గురించే ఆలోచిస్తార‌ని చెప్పాడు. ఇక‌పై నుంచయినా సినిమా తీయ‌డంలో బాలీవుడ్ మెళకువలు నేర్చుకోవాల‌ని ఆయ‌న అన్నాడు. 




More Telugu News