జంటనగరాల్లో ఎంఎంటీఎస్ చార్జీలను సగానికి సగం తగ్గించిన రైల్వే శాఖ

  • కరోనా వ్యాప్తి సమయంలో నిలిచిన ఎంఎంటీఎస్ లు
  • రైళ్లను పునరుద్ధరిస్తున్న అధికారులు
  • ఫస్ట్ క్లాస్ టికెట్ చార్జీలో 50 శాతం తగ్గింపు
  • మే 5 నుంచి తగ్గింపు అమలు
హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో ఎంఎంటీఎస్ రైళ్లు నిత్యం వేలమంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతూ ప్రజారవాణ వ్యవస్థలో తమ వంతు సేవలందిస్తున్నాయి. అయితే కరోనా వ్యాప్తి ప్రభావం ఎంఎంటీఎస్ ల పైనా పడింది. దాంతో పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. అయితే, ప్రస్తుతం కరోనా వ్యాప్తి గణనీయంగా తగ్గిపోవడంతో అధికారులు ఎంఎంటీఎస్ రైళ్లను పునరుద్ధరిస్తున్నారు. 

ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల ఎంఎంటీఎస్ రైళ్లలో చార్జీలను సగానికి సగం తగ్గించింది. సబర్బన్ సింగిల్ జర్నీ ఫస్ట్ క్లాస్ చార్జీలకు వర్తించేలా టికెట్ ధరలో 50 శాతం తగ్గింపును ప్రకటించింది. కొత్త చార్జీలు మే 5 నుంచి అమల్లోకి వస్తాయని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో వెల్లడించింది. ఫలక్ నుమా-సికింద్రాబాద్, హైదరాబాద్-లింగంపల్లి-రామచంద్రాపురం మధ్య ప్రయాణించేవారికి ఈ నిర్ణయం ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొంది. ప్రయాణికులు టికెట్ ధర తగ్గింపును సద్వినియోగం చేసుకోవాలని కోరింది.


More Telugu News