రాహుల్ పక్కన ఉన్న మహిళ చైనా రాయబారి కాదట.. ఆమె ఎవరంటే..!

  • నేపాల్ లోని నైట్ క్లబ్లులో కనిపించిన రాహుల్
  • ఆమె చైనా రాయబారి అంటూ విజయసాయి సహా పలువురి కామెంట్లు
  • ఆమె సుమ్నిమా ఉదాస్ స్నేహితురాలని వెల్లడించిన ఓ జాతీయ మీడియా సంస్థ
నేపాల్ లోని ఓ నైట్ క్లబ్ లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కనిపించడం, ఆయన పక్కన ఓ మహిళ ఉండటం తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. 

అయితే, రాహుల్ పక్కన ఉన్న మహిళ ఎవరనే విషయంపైనే ఎక్కువ చర్చ నడిచింది. ఆమె నేపాల్ లోని చైనా రాయబారి హౌ యాంకీ అంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డితో పాటు పలువురు నేతలు పేర్కొన్నారు. విజయసాయి రెడ్డి మరో అడుగు ముందుకేసి 'చైనా హనీ ట్రాప్' అనే పదాన్ని కూడా వాడారు. 

మరోవైపు ఈ అంశానికి సంబంధించి ఓ జాతీయ మీడియా సంస్థ ఫ్యాక్ట్ చెక్ చేయగా... ఆమె చైనా రాయబారి కాదని తేలింది. ఆయన పక్కనున్న మహిళ సీఎన్ఎన్ మాజీ జర్నలిస్ట్ సుమ్నిమా ఉదాస్ స్నేహితురాలని, ఆమె నేపాల్ జాతీయురాలని సదరు మీడియా సంస్థ ప్రకటించింది. ఈ విషయాన్ని నైట్ క్లబ్ యజమాని వెల్లడించారని పేర్కొంది. క్లబ్ కు రాహుల్ తో పాటు మరో ఐదారుగురు స్నేహితులు వచ్చారని... వీరిలో ఏ ఒక్కరూ చైనీయులు కాదని ఆయన స్పష్టం చేసినట్టు తెలిపింది. దాదాపు గంటన్నర సేపు రాహుల్ నైట్ క్లబ్ లో ఉన్నట్టు పేర్కొంది. 

సుమ్నిమా వివాహానికి హాజరయ్యేందుకు రాహుల్ నేపాల్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. విందును నైట్ క్లబ్ లో ఏర్పాటు చేయగా.. ఆ సమయంలో రాహుల్ అక్కడున్న సందర్భంలో తీసిన వీడియో దుమారం రేపింది. కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో రాహుల్ నైట్ క్లబ్ లో ఉన్నారంటూ బీజేపీ ఎద్దేవా చేసింది. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. స్నేహితురాలి వివాహానికి వెళ్లడం నేరం కాదు కదా? అని ప్రశ్నించింది.


More Telugu News