గూగుల్ నుంచి త్వరలో... స్మార్ట్ వాచ్

  • నూతన ఆవిష్కరణలతో వస్తున్న గూగుల్
  • ఈ నెల 11, 12 తేదీల్లో గూగుల్ ఐ/ఓ టెక్ ఫెయిర్
  • తమ ఉత్పాదనలను పరిచయం చేయనున్న దిగ్గజం
  • ఆండ్రాయిడ్ లో కొత్త వెర్షన్ కు రంగం సిద్ధం
కరోనా సమయంలో నిదానించిన పలు ప్రాజెక్టులను టెక్ దిగ్గజం గూగుల్ వేగవంతం చేసింది. త్వరలోనే యూజర్ల ముందుకు తన నూతన ఆవిష్కరణలు తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. వాటిలో ముఖ్యమైనది గూగుల్ స్మార్ట్ వాచ్. ఇప్పటికే ఎలక్ట్రానిక్స్, టెక్ జెయింట్లు స్మార్ట్ వాచ్ ల రంగంలో దూసుకుపోతున్నాయి. ఇప్పుడు వాటి సరసన గూగుల్ కూడా చేరనుంది. వేర్ ఓఎస్ 3.1 వెర్షన్ తో పిక్సెల్ స్మార్ట్ వాచ్ తీసుకువచ్చేందుకు గూగుల్ తుది సన్నాహాలు చేస్తోంది. 

త్వరలోనే గూగుల్ ఐ/ఓ 2022 పేరిట తన నూతన ఉత్పత్తుల ప్రదర్శన, పరిచయ కార్యక్రమం నిర్వహించనుంది. దీంట్లోనే తన లేటెస్ట్ స్మార్ట్ వాచ్ ను కూడా ప్రపంచానికి చూపించనుంది. 

ఇక, ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్ ను కూడా గూగుల్ ఆవిష్కరించనుంది. 2021లో ఆండ్రాయిడ్-12 ఆపరేటింగ్ సిస్టమ్ ను విడుదల చేసిన గూగుల్.... తాజాగా ఆండ్రాయిడ్-13 ఓఎస్ ను ప్రవేశపెడుతోంది. ప్రస్తుతానికి ఇది గూగుల్ పిక్సెల్ ఫోన్ లో అందుబాటులోకి రానుంది. త్వరలోనే అన్ని ఫోన్లలో ఇది రంగప్రవేశం చేయనుంది. కొత్త ఓఎస్ లో అనేక అప్ డేటెడ్ ఫీచర్లు ఉన్నట్టు సమాచారం. 

కొత్త ఓఎస్ మాత్రమే కాదు, కొత్త ఓఎస్ తో ముస్తాబైన సరికొత్త ఫోన్ ను కూడా గూగుల్ తన పోర్ట్ ఫోలియోలో చేర్చుతోంది. గూగుల్ పిక్సెల్ 6ఏ పేరిట ఈ ఫోన్ ను విడుదల చేయనున్నారు. కొత్త ఓఎస్ తో వస్తుంది కాబట్టి దీనికి గిరాకీ బాగానే ఉండొచ్చని గూగుల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంట్లో ప్రధానంగా 12 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, ఫ్రంట్ లో 8 ఎంపీ కెమెరా ఇచ్చారు. 

అయితే, గూగుల్ పిక్సెల్ 6ఏ పేరును గూగుల్ ప్రకటించలేదు కానీ, ఇప్పటికే ఉన్న మోడల్ పిక్సెల్ 5ఏ కాబట్టి, తర్వాత వచ్చే మోడల్ 6ఏ అయ్యుంటుందని నిపుణులు అంచనా వేశారు. మే 11, 12 తేదీల్లో గూగుల్ ఐ/ఓ టెక్ ఫెయిర్ జరగనున్న నేపథ్యంలో మరిన్ని ఆవిష్కరణలను గూగుల్ పరిచయం చేసే అవకాశం ఉంది.


More Telugu News