"నేనెవర్ని" అని అడిగితే ఓ చిన్నారి నుంచి "రాహుల్ గాంధీ" అని జవాబొచ్చింది: అఖిలేశ్ యాదవ్

  • యూపీ అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ
  • విద్యావ్యవస్థపై స్పందించిన అఖిలేశ్ యాదవ్
  • జాతీయ జాబితాలో యూపీ దిగువన నిలిచిందని విమర్శ  
 జాతీయ విద్యా జాబితాలో ఉత్తరప్రదేశ్ కింది నుంచి నాలుగో స్థానంలో నిలవడం పట్ల సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ, బీజేపీ సర్కారు రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బదులు ఈజ్ ఆఫ్ డూయింగ్ క్రైమ్ ను తీసుకొచ్చిందని విమర్శించారు. 

దేశానికి అనేకమంది ప్రధానమంత్రులను అందించిన రాష్ట్రంలో విద్యా వ్యవస్థ స్థాయి ఇదీ! అంటూ ఆయన వ్యంగ్యం ప్రదర్శించారు. నరేంద్ర మోదీ ప్రధాని అయింది కూడా యూపీ వల్లనే అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అఖిలేశ్ ఓ ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు.

గతంలో తాను సీఎంగా ఉన్నప్పుడు ఓసారి ప్రైమరీ స్కూల్లో తనిఖీకి వెళ్లానని గుర్తుచేసుకున్నారు. "నేనెవర్ని?" అంటూ స్కూల్లో ఓ చిన్నారిని ప్రశ్నించగా, ఆ చిన్నారి నుంచి "రాహుల్ గాంధీ" అంటూ సమాధానమొచ్చిందని అసెంబ్లీలో నవ్వులు పూయించారు. ఆ చిన్నారి తనను గుర్తుపట్టలేదని, తనను చూసి రాహుల్ గాంధీ అనుకున్నట్టు తెలిపారు. అఖిలేశ్ యాదవ్ 2012 నుంచి 2017 వరకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.


More Telugu News