వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను తక్షణమే అరెస్ట్ చేయాలి: నారా లోకేశ్

  • ప్రభుత్వ ఇంజినీర్ పై చేయిచేసుకున్న జక్కంపూడి రాజా
  • వైసీపీ నేతల్లో ఉన్మాదం కట్టలు తెంచుకుంటోందన్న లోకేశ్
  • బాధితుడు సూర్యకిరణ్ కు న్యాయం చేయాలని డిమాండ్
వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను తక్షణమే అరెస్ట్ చేయాలి: నారా లోకేశ్
ప్రభుత్వ ఇంజినీర్ పై వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చేయిచేసుకోవడం దుమారం రేపుతోంది. ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార వైసీపీ పార్టీ నాయకుల ఉన్మాదం కట్టలు తెంచుకుంటోందని అన్నారు. ప్రతిపక్షాలు, ప్రజలు అయిపోయారని... ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులపై వైసీపీ అసెంబ్లీ రౌడీలు పడ్డారని మండిపడ్డారు. తన అనుచరుల బిల్లులు చేయలేదని పోలవరం ఏఈ సూర్యకిరణ్ ను వైసీపీ రౌడీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కొట్టడం దారుణమని అన్నారు. 

మంత్రి, ఉన్నతాధికారుల సమక్షంలోనే ఇంజినీరుపై దాడి జరిగినా ఎవరూ ఆపే ప్రయత్నం కూడా చేయకపోవడం విచారకరమని నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల హక్కులు, ప్రయోజనాల కోసం పోరాడే ఉద్యోగ సంఘాల నాయకులు ఈ దాడిని ఖండించకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. సూర్యకిరణ్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ఇంజినీర్ పై దాడికి పాల్పడిన జక్కంపూడి రాజాను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితుడు సూర్యకిరణ్ కు న్యాయం చేయాలని అన్నారు.


More Telugu News