మీ ఇష్టం.. తాడేపల్లి రమ్మంటారా?, పోలవరం రమ్మంటారా?: జగన్, అంబటికి దేవినేని సవాల్

  • కమీషన్లకు కక్కుర్తిపడి పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారన్న దేవినేని
  • రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్ తీరని తప్పు చేశారని  ఆగ్రహం
  • 2022 నాటికి ప్రాజెక్టును పూర్తిచేస్తామని అనిల్ కుమార్ అన్నారని గుర్తు చేసిన మాజీ మంత్రి
  • ఇప్పుడేమో అంబటి మరోలా చెబుతున్నారని దేవినేని ఫైర్
పోలవరం ప్రాజెక్టుపై తాము చర్చకు సిద్ధమని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటించారు. రాజమహేంద్రవరంలో నిన్న విలేకరులతో మాట్లాడిన ఆయన.. ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

కమీషన్లకు కక్కుర్తి పడి పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని, రివర్స్ టెండరింగ్ పేరుతో పనులు ఆపేసి జగన్ తీరని తప్పు చేశారని విమర్శించారు. 2022 నాటికి ప్రాజెక్టును పూర్తిచేస్తామని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ శాసనసభలో ప్రకటించారని, ఇప్పుడేమో మరో మంత్రి అంబటి మాట్లాడుతూ అది ఎప్పటి వరకు పూర్తవుతుందో తెలియదని అంటున్నారని దేవినేని ఎద్దేవా చేశారు. 

పోలవరం ప్రాజెక్టుపై చర్చకు రావాలంటూ చంద్రబాబుకు సవాలు విసరడం హాస్యాస్పందంగా ఉందన్నారు. చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, తాడేపల్లి రావాలో లేదంటే పోలవరం ప్రాజెక్టు వద్దకు రావాలో చెప్పాలంటూ సీఎం జగన్, అంబటికి దేవినేని సవాలు విసిరారు. 

ఏపీ అంటే అమరావతి, పోలవరం అని.. ఈ రెండింటినీ ప్రభుత్వం నాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని ఆరోపించారు. పవర్ ప్రాజెక్టు పూర్తయితే 900 మెగావాట్ల జలవిద్యుత్ అందుబాటులోకి వచ్చి ఉండేదన్నారు. ఢిల్లీ వెళ్లిన జగన్ అక్కడ ప్రధానితో ఏం మాట్లాడారో మీడియాకు వెల్లడించాలని దేవినేని డిమాండ్ చేశారు.


More Telugu News