సోనియాకు మ‌రోమారు ఈడీ స‌మ‌న్లు... 23న విచార‌ణ‌కు రావాలంటూ ఆదేశం

  • ఈ నెల 8నే విచార‌ణ‌కు రావాల్సి ఉన్న సోనియా
  • కరోనా కార‌ణంగా విచార‌ణ‌కు గైర్హాజ‌రైన కాంగ్రెస్ అధినేత్రి
  • తాజాగా 23న విచార‌ణ‌కు రావాలంటూ ఈడీ నోటీసులు
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాందీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ తాజాగా శుక్ర‌వారం మ‌రోమారు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న త‌మ ముందు విచార‌ణ‌కు హాజ‌రు కావాలంటూ స‌ద‌రు నోటీసుల్లో ఈడీ అధికారులు సోనియాను ఆదేశించారు. వాస్త‌వానికి ఈ నెల 8న సోనియా గాంధీ ఈడీ విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సి ఉంది. అయితే క‌రోనా కార‌ణంగా తాను విచార‌ణ‌కు హాజ‌రు కాలేన‌ని సోనియా ద‌ర్యాప్తు సంస్థ‌కు తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే.

అంతేకాకుండా క‌రోనా సోకిన నేప‌థ్యంలో వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స తీసుకుంటున్నాన‌ని చెప్పిన సోనియా... క‌రోనా నుంచి కోలుకునేందుకు త‌న‌కు క‌నీసం 3 వారాల స‌మ‌యం ప‌డుతుంద‌ని, అప్ప‌టిదాకా విచార‌ణ‌కు హాజ‌రు కాలేన‌ని తెలిపారు. సోనియా అభ్య‌ర్థ‌న‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న ఈడీ అధికారులు... తాజా నోటీసులు జారీ చేశారు. నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో సోనియాతో పాటు రాహుల్ గాంధీకి కూడా ఈడీ నోటీసులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే.


More Telugu News