రెండో రోజూ ఈడీ విచార‌ణ‌కు రాహుల్ గాంధీ... తొలి రోజు మాదిరే కాంగ్రెస్ నేత‌కు లంచ్ బ్రేక్‌

  • వ‌రుస‌గా రెండో రోజూ ఈడీ కార్యాల‌యానికి రాహుల్‌
  • రెండు గంట‌ల పాటు రాహుల్‌ను విచారించిన ఈడీ
  • మ‌ధ్యాహ్న భోజ‌నం కోసం విచార‌ణ‌కు విరామం
  • భోజ‌నం త‌ర్వాత తిరిగి ఈడీ ఆఫీస్‌కు వెళ్ల‌నున్న రాహుల్‌
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ మంగ‌ళ‌వారం వ‌రుస‌గా రెండో రోజూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) విచార‌ణకు హాజ‌ర‌య్యారు. నేష‌న‌ల్ హెరాల్డ్ ఆస్తుల వ్య‌వ‌హారంలో మ‌నీ ల్యాండ‌రింగ్ జ‌రిగింద‌న్న ఆరోప‌ణ‌ల‌పై రాహుల్ స‌హా సోనియా గాంధీపైనా కేసులు న‌మోదైన సంగ‌తి తెలిసిందే. ఈ వ్యవ‌హారంలో విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని సోనియా స‌హా రాహుల్‌కు కూడా ఈడీ నోటీసులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈడీ నోటీసుల‌కు అనుగుణంగా సోమ‌వారం రాహుల్ గాంధీ విచార‌ణకు హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. సోమ‌వారం విచార‌ణ‌లో భాగంగా మ‌ధ్యాహ్న భోజ‌నం కోసం రాహుల్‌కు ఈడీ అధికారులు విరామం ఇచ్చారు. దీంతో ఇంటికెళ్లి భోజ‌నం చేసి వ‌చ్చిన రాహుల్‌పై ఈడీ అధికారులు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. నిన్న రోజంతా ఏకంగా 10 గంట‌ల పాటు రాహుల్‌ను ఈడీ విచారించింది. మంగ‌ళ‌వారం కూడా విచార‌ణ‌కు హాజ‌రు కావాలంటూ నిన్న రాత్రి ఈడీ అధికారులు రాహుల్‌కు స‌మ‌న్లు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈడీ నోటీసుల‌తో మంగ‌ళ‌వారం కూడా రాహుల్ గాంధీ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఓ రెండు గంట‌ల పాటు రాహుల్‌ను ప్రశ్నించిన ఈడీ అధికారులు నిన్న‌టి మాదిరే మంగ‌ళ‌వారం కూడా రాహుల్‌కు భోజ‌న విరామం ఇచ్చారు. దీంతో కాసేప‌టి క్రితం రాహుల్ గాంధీ ఈడీ కార్యాల‌యం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. భోజ‌నం త‌ర్వాత తిరిగి రాహుల్ గాంధీ ఈడీ ఆఫీస్‌కు వెళ్ల‌నున్నారు.


More Telugu News