సాయంత్రం 5 గంటల భేటీకి రాని వారంతా పార్టీలో లేన‌ట్టే: శివ‌సేన కీల‌క ప్ర‌క‌ట‌న‌

  • 40 మంది ఎమ్మెల్యేల‌తో మంత్రి ఏక్‌నాథ్ షిండే క్యాంపు 
  • చివ‌రి ప్ర‌య‌త్నంగా అత్య‌వ‌స‌ర స‌మావేశానికి శివ‌సేన పిలుపు
  • ఉద్ధ‌వ్ థాక‌రే నివాసంలో బుధ‌వారం సాయంత్రం 5 గంట‌ల‌కు స‌మావేశం
  • స‌మావేశానికి రాని వారిపై పార్టీ ఫిరాయింపుల చ‌ట్టాన్ని ప్ర‌యోగించే దిశ‌గా అడుగులు
మ‌హారాష్ట్రలో నెల‌కొన్న రాజ‌కీయ సంక్షోభం నుంచి బ‌య‌ట‌ప‌డే మార్గం క‌నిపించ‌క శివ‌సేన అయోమ‌యంలో చిక్కుకుంది. శివ‌సేన‌కు చెందిన కీల‌క నేత‌, మంత్రి ఏక్‌నాథ్ షిండే పార్టీకి చెందిన 40 మందికి పైగా ఎమ్మెల్యేల‌ను త‌న‌వైపున‌కు తిప్పుకుని క్యాంపు రాజ‌కీయాల‌కు తెర తీశారు. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో క్లియ‌ర్ మెజారిటీకి చాలా దూరంలోనే నిలిచిపోయిన శివ‌సేన‌.. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల మ‌ద్ద‌తుతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఆ పార్టీకి షాకిస్తూ సొంత పార్టీ నేత ఎదురు తిర‌గ‌డంతో శివ‌సేన చిక్కుల్లో ప‌డిపోయింది.

ఈ నేప‌థ్యంలో బుధ‌వారం సాయంత్రం 5 గంట‌ల‌కు సీఎం ఉద్ధ‌వ్ థాక‌రే నివాసంలో అత్య‌వ‌స‌ర స‌మావేశాన్ని ఏర్పాటు చేశామ‌ని, ఈ స‌మావేశానికి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా హాజ‌రు కావాల్సిందేన‌ని శివ‌సేన అల్టిమేటం జారీ చేసింది. ఈ స‌మావేశానికి హాజ‌రు కాని వారిని పార్టీలో లేని వారిగానే గుర్తించి చ‌ట్ట‌ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపింది. ఈ మేర‌కు పార్టీకి చెందిన ఎమ్మెల్యేంద‌రికీ శివ‌సేన చీఫ్ విప్ సునీల్ ప్రభు ఓ లేఖ పంపారు. ఈ స‌మావేశానికి హాజ‌రు కాని ఎమ్మెల్యేల‌పై పార్టీ ఫిరాయింపుల నిరోధ‌క చ‌ట్టాన్ని ప్ర‌యోగించే దిశ‌గా శివ‌సేన అడుగులు వేస్తున్న‌ట్లు స‌మాచారం.


More Telugu News