మిమ్మల్ని విజయమ్మ, షర్మిల, కేవీపీ, సూరీడు ఎవరూ నమ్మట్లేదు... ప్రజలెందుకు నమ్మాలి?: సీఎం జగన్ ను ప్రశ్నించిన సోమిరెడ్డి

  • సీఎం జగన్ పై సోమిరెడ్డి విమర్శనాస్త్రాలు
  • జగన్ కు అందరూ దూరమయ్యారని వెల్లడి
  • ప్లీనరీ ఓ డ్రామా అని వ్యాఖ్యలు
  • ఆత్మస్తుతి పరనింద తప్ప ఏమీలేదని విమర్శలు
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ ను విజయమ్మ, షర్మిల, కేవీపీ, సూరీడు ఎవరూ నమ్మట్లేదని అన్నారు. పార్టీకి విజయమ్మ సెలవు చీటీ ఇచ్చేశారని, చెల్లి షర్మిల అన్న ముఖం చూడకూడదని మరో రాష్ట్రానికి వెళ్లిపోయిందని వివరించారు. జగన్ విడిచిన బాణం అని వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఆమె ఇప్పుడు దూరమైందని అన్నారు. 

వైఎస్సార్ ఆత్మగా భావించే కేవీపీ మిమ్మల్ని ఏ పార్టీ జైలుకు పంపించిందని అనుకుంటున్నారో ఆ పార్టీలో ఉన్నాడు అని తెలిపారు. వైఎస్సార్ నీడ అని సూరీడు గురించి చెబుతారు... ఇప్పుడా నీడ మాయమైపోయిందని పేర్కొన్నారు. మరో చెల్లి సునీత అయితే జగన్ ముఖం చూసేందుకు కూడా ఇష్టపడడంలేదని తెలిపారు. ఇప్పుడు మిమ్మల్ని కుటుంబ సభ్యులు, ఆత్మీయులే నమ్మనప్పుడు ప్రజలెందుకు నమ్మాలి? అని ప్రశ్నించారు. 

ఆత్మస్తుతి, పరనింద తప్ప ప్లీనరీలో ఏముందని సోమిరెడ్డి పెదవి విరిచారు. మంత్రులు, ఇతర నేతలతో పొగిడించుకోవడానికి, విపక్ష నేతలను విమర్శించడానికే ప్లీనరీ నిర్వహించారని విమర్శించారు. ఈ ప్లీనరీ ఓ డ్రామా అని ఆరోపించారు.


More Telugu News