ఝార్ఖండ్‌లో పెను విషాదం.. బోటు బోల్తాపడి ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది జలసమాధి!

  • కోడెర్మా జిల్లాలో ఘటన
  • ఆదివారం కావడంతో డ్యామ్ చూసేందుకు వెళ్లిన కుటుంబం
  • జలాశయం మధ్యలోకి వెళ్లాక బోటులోకి నీళ్లు
  • మృతుల్లో ఏడుగురు 18 ఏళ్లలోపు వారే
ఝార్ఖండ్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. బోటు బోల్తాపడి ఒకే కుటుంబానికి చెందిన 8 మంది జలసమాధి అయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కోడెర్మా జిల్లాలోని రాజ్‌ధన్‌వార్ ప్రాంతానికి చెందిన సీతారాం యాదవ్ కుటుంబం ఆదివారం కావడంతో నిన్న పంచఖేరో డ్యామ్‌కు వెళ్లింది. అనంతరం అందరూ కలిసి పడవలో షికారుకు వెళ్లారు. 

జలాశయం మధ్యకు వెళ్లేసరికి బోటులోకి ఒక్కసారిగా నీళ్లు రావడంతో బోల్తాపడింది. పడవ నడిపే వ్యక్తితోపాటు బాధిత కుటుంబానికి చెందిన ప్రదీప్ కుమార్ ఒడ్డుకు చేరుకోగా, మిగతా ఎనిమిది మందీ చనిపోయారు. వారిలో ఏడుగురు 18 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందం డ్యామ్‌లో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టింది.


More Telugu News