రేపు ఈడీ విచార‌ణ‌కు హాజ‌రుకానున్న సోనియా గాంధీ

  • ఉద‌యం 11 గంట‌ల‌కు ఈడీ ఆఫీస్‌కు వెళ్ల‌నున్న సోనియా
  • 10.30 గంట‌ల‌కు పార్టీ నేత‌ల‌తో కీల‌క స‌మావేశం
  • నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచార‌ణ‌కు కాంగ్రెస్ అధినేత్రి
కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్య‌క్షురాలు సోనియా గాంధీ రేపు (గురువారం) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) విచార‌ణ‌కు హాజ‌రుకానున్నారు. కాంగ్రెస్ పార్టీ సొంత‌ ప‌త్రిక నేష‌న‌ల్ హెరాల్డ్ ఆస్తుల వ్య‌వ‌హారానికి సంబంధించిన కేసులో త‌మ ముందు విచార‌ణ‌కు హాజ‌రుకావాలంటూ ఈడీ అధికారులు సోనియాకు స‌మ‌న్లు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ మేర‌కు రేపు ఉద‌యం 11 గంట‌ల‌కు ఆమె ఈడీ కార్యాల‌యానికి వెళ్ల‌నున్నారు. అంత‌కుముందు ఉద‌యం 10.30 గంట‌ల‌కు కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యంలో పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు, పార్టీ ఎంపీల‌తో భేటీ కానున్నారు. 

గ‌తంలోనే విచార‌ణ‌కు రావాలంటూ ఈడీ జారీ చేసిన స‌మ‌న్ల‌కు స్పందించిన సోనియా... అనారోగ్య కార‌ణాల వ‌ల్ల ఇప్ప‌టికిప్పుడు విచార‌ణ‌కు హాజ‌రు కాలేన‌ని, 3 వారాల త‌ర్వాత విచార‌ణ‌కు హాజ‌ర‌వుతాన‌ని తెలిపిన సంగ‌తి తెలిసిందే. సోనియా విజ్ఞ‌ప్తికి సానుకూలంగా స్పందించిన ఈడీ అధికారులు ఈ నెల 21న విచార‌ణ‌కు హాజ‌రుకావాలంటూ ఇటీవ‌లే నోటీసులు జారీ చేశారు. ఈ క్ర‌మంలోనే గురువారం సోనియా గాంధీ ఈడీ విచార‌ణ‌కు హాజ‌రుకానున్నారు. ఈ కేసులో ఇప్ప‌టికే రాహుల్ గాంధీని ఈడీ అధికారులు 5 రోజుల పాటు విచారించిన సంగ‌తి తెలిసిందే.


More Telugu News