హిట్లర్ వాచీ రూ.8.6 కోట్లు.. స్వస్తిక్ ముద్ర సహా ప్రత్యేకతలెన్నో!

  • అమెరికాలో వేలం వేసిన అలెగ్జాండర్ హిస్టారికల్ ఆక్షన్స్ సంస్థ
  • రెండు వైపులా తిప్పుకోగల ప్రత్యేకమైన వాచీ.. స్వస్తిక్, గ్రద్ద ముద్రలు
  • హిట్లర్ కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన ఆయన పార్టీ నేతలు.. 1933 ఏప్రిల్ 20న హిట్లర్ పుట్టిన రోజు సందర్భంగా బహూకరణ
చరిత్రలో విలన్లు అయినా.. హీరోలు అయినా.. వారికి ఎప్పటికీ ఓ క్రేజ్ ఉంటుంది. అదే క్రమంలో ప్రపంచాన్ని ఏలాలన్న కలతో నియంతగా మారి.. రెండో ప్రపంచ యుద్ధానికి కారకుడిగా నిలిచిన జర్మనీ పాలకుడు అడాల్ఫ్ హిట్లర్ అంటే ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. నాడు హిట్లర్ ధరించిన ‘ఆండ్రియాస్ హ్యూబర్’ వాచీని తాజాగా వేలం వేస్తే.. ఏకంగా రూ.8.6 కోట్లు పలకడం గమనార్హం.

వాచీ ప్రత్యేకతలేమిటి?
  • జర్మనీకి చెందిన నేషనలిస్ట్ సోషలిస్ట్ వర్కర్స్ పార్టీ మెంబర్లు హిట్లర్ కోసం ప్రత్యేకంగా ఈ వాచీని తయారు చేయించారు. 1933 ఏప్రిల్ 20న హిట్లర్ పుట్టిన రోజు సందర్భంగా దీనిని బహూకరించారు.
  • జర్మనీ నాజీలకు ఆరాధ్య చిహ్నమైన స్వస్తిక్ గుర్తు ప్రముఖంగా కనబడేలా.. దానిపై గద్ద బొమ్మను హిట్లర్ వాచీపై చిత్రించారు.
  • అడాల్ఫ్ హిట్లర్ పేరులోని రెండు పదాల మొదటి అక్షరాలు వచ్చేలా ‘ఏ హెచ్’ అని వాచీ పైభాగంపై ఏర్పాటు చేశారు.
  • చిత్రమేంటంటే ఈ వాచీ రివర్సిబుల్. అంటే గడియారం ఉన్న భాగాన్ని పక్కకు తీసి.. తిప్పి పెట్టుకోవచ్చు. దీనితో ఇటు గడియారంలా కనిపిస్తుంది. దాన్ని తిప్పి పెట్టుకున్నప్పుడు స్వస్తిక్ గుర్తు, ఏహెచ్ అనే అక్షరాలు, గ్రద్ద బొమ్మ కనిపిస్తాయి.
  • 1945లో హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాక.. బవేరియాలో ఆయన నివసించిన ఆల్పైన్ రెసిడెన్స్ లో తనిఖీలు చేసిన ఫ్రెంచ్ సైనికులకు ఈ వాచీ దొరికింది.
  • అలా చేతులు మారుతూ తాజాగా అమెరికాలోని మేరీల్యాండ్ లో ఉన్న అలెగ్జాండర్ హిస్టారికల్ ఆక్షన్స్ వేలం శాలకు చేరింది.
  • ఇటీవలే దీనిని వేలం వేయగా పేరు బయటికి వెల్లడించడానికి ఇష్టపడని ఓ వ్యక్తి రూ.8.6 కోట్లు చెల్లించి హిట్లర్ వాచీని సొంతం చేసుకున్నారు.



More Telugu News