ఇరాన్‌లో దుమారం రేపుతున్న ఐస్‌క్రీం యాడ్.. మహిళలు ప్రకటనల్లో నటించడంపై నిషేధం

  • మహిళలతో రెండు ఐస్‌క్రీం యాడ్స్ చేసిన ‘మాగ్నమ్’
  • హిజాబ్ పద్ధతులు పాటించలేదంటూ మత పెద్దల ఆగ్రహం
  • దిగొచ్చిన ప్రభుత్వం.. యాడ్స్‌ కంపెనీలకు లేఖ
మహిళలు ఐస్‌క్రీం తింటున్నట్టుగా ఇటీవల విడుదలైన మాగ్నమ్ బ్రాండ్‌కు చెందిన రెండు ప్రకటనలు ఇరాన్‌లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ యాడ్స్‌లో మహిళలను అభ్యంతరకరంగా చూపించారని, హిజాబ్ పద్ధతులు పాటించలేదంటూ మతపెద్దలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో దిగొచ్చిన ప్రభుత్వం.. ఇకపై మహిళలు ప్రకటనల్లో నటించడానికి వీల్లేదంటూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు, దేశంలోని యాడ్ ఏజెన్సీలకు ఇరాన్ సాంస్కృతిక శాఖ లేఖ రాస్తూ.. ఇకపై ఎలాంటి ప్రకటనల్లోనూ నటించేందుకు మహిళలకు అనుమతి లేదని పేర్కొంది. 

సుప్రీం కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రెవల్యూషన్ తీర్పులకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. 1979 ఇస్లామిక్ విప్లవం నుంచి బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్ ధరించడాన్ని తప్పనిసరి చేశామని అందులో పేర్కొన్న సాంస్కృతిక శాఖ.. హిజాబ్ పవిత్ర నియమాలను ఉటంకించింది. కాగా, తప్పనిసరి హిజాబ్ నిబంధనను ఇటీవలి కాలంలో ఇరాన్ మహిళలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.


More Telugu News