అనిత మీడియా సమావేశంలో ఉండగా గోరంట్ల మాధవ్ పై మాట్లాడొద్దని ఓ వైసీపీ నేత ఫోనులో బెదిరించాడు: చంద్రబాబు

  • వంగలపూడి అనిత ప్రెస్ మీట్లో బెదిరింపుల కలకలం
  • ఫోన్ చేసి బెదిరించిన వైనం
  • మండిపడిన చంద్రబాబు
  • ప్రభుత్వ దారుణాలపై మాట్లాడకూడదా అంటూ ఆగ్రహం
టీడీపీ తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా, ఫోన్ లో ఆమెకు బెదిరింపులు రావడం తెలిసిందే. ఆ ఫోన్ కాల్ ను స్పీకర్ ఆన్ చేసి ఆమె మీడియా ప్రతినిధులకు వినిపించారు.

ఈ నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. వంగలపూడి అనిత మీడియా సమావేశంలో ఉండగా, వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అంశంలో స్పందించవద్దంటూ ఓ వైసీపీ నేత ఫోనులో ఆమెను బెదిరించాడని చంద్రబాబు ఆరోపించారు. వాళ్ల ఎంపీ చేసిన తప్పుడు పనిని కప్పిపుచ్చడానికి వైసీపీ పెద్దలు ఎంత తీవ్రంగా ప్రయత్నిస్తున్నారో అర్థమవుతోందని పేర్కొన్నారు. 

ప్రభుత్వ దారుణాలపై మాట్లాడకూడదని చెప్పడం హక్కులను హరించడమేనని స్పష్టం చేశారు. దీనిని తాను ఖండిస్తున్నానని చంద్రబాబు తెలిపారు. ఒక మహిళా నేతనే ఫోన్ చేసి బెదిరించే స్థాయికి వైసీపీ నేతలు తెగబడ్డారంటే, రాష్ట్రంలో సామాన్య మహిళలు ఎలాంటి భయంకర పరిస్థితుల్లో ఉన్నారో ఆలోచించుకోండి అని పేర్కొన్నారు. 

పోలీసులు దీనిపై చర్యలు తీసుకోరా? అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి ఆదేశాలు వచ్చేంతవరకు అన్నింటినీ చూస్తూ కూర్చోవడమే పోలీసుల పని అన్నట్టుగా తయారైందని విమర్శించారు.


More Telugu News