బ్యాంకాక్‌ హోటల్‌లో శ్రీలంక మాజీ అధ్యక్షుడు.. బయటకు రావొద్దన్న పోలీసులు

  • వెల్లువెత్తిన ఆందోళనతో దేశం విడిచి పారిపోయిన గొటబాయ
  • బ్యాంకాక్‌లోని ఓ హోటల్‌లో బస చేసిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు
  • మానవతా దృక్పథంలోనే ఆశ్రయం ఇచ్చామన్న థాయ్ ప్రధాని
ఆర్థిక సంక్షోభం, అనంతర పరిణామాలతో దేశం విడిచి పారిపోయిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స బ్యాంకాక్‌లోని ఓ హోటల్‌లో ఉంటున్నారు. సింగపూర్‌లో తన వీసా గడువు ముగిసిన వెంటనే బ్యాంకాక్ చేరుకున్న ఆయనకు మరో దేశం శాశ్వతంగా ఆశ్రయం ఇచ్చే వరకు థాయిలాండ్‌లోనే ఉండేందుకు అక్కడి ప్రభుత్వం ఆయనకు అనుమతినిచ్చింది.

అయితే, భద్రతా కారణాల రీత్యా హోటల్ నుంచి బయటకు రావొద్దని పోలీసులు ఆయనకు సూచించారు. మరోవైపు, గొటబాయకు మానవతా కారణాలతోనే దేశంలో తాత్కాలికంగా ఉండేందుకు అనుమతినిచ్చినట్టు థాయిలాండ్ ప్రధాని ప్రయూత్ చాన్-ఓ-చా తెలిపారు. థాయిలాండ్‌లో ఉన్నంత వరకు ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు సాగించబోనని గొటబాయ హామీ ఇచ్చినట్టు తెలిపారు. 

గొటబాయ వద్ద దౌత్యపరమైన పాస్‌పోర్టు ఉందని, కాబట్టి ఆయన 90 రోజుల వరకు దేశంలో ఉండొచ్చని థాయిలాండ్ విదేశాంగ మంత్రి ప్రముద్వినై పేర్కొన్నారు. గొటబాయ థాయిలాండ్‌లో ఉండే విషయంలో శ్రీలంక ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి అభ్యంతరం రాలేదన్నారు. ఆయనకు తాము వసతి ఏర్పాట్లు చేయడం లేదని కూడా మంత్రి స్పష్టం చేశారు. 

మరోవైపు, గొటబాయ వీసా గడువు ముగిసిన తర్వాత నవంబరులో తిరిగి శ్రీలంక వెళ్తారని సమాచారం. అలాగే, గొటబాయకు తాత్కాలికంగా ఆశ్రయం కల్పించాలని శ్రీలంక ప్రభుత్వమే థాయిలాండ్‌ను కోరినట్టు కూడా అక్కడి మీడియా పేర్కొంది.


More Telugu News