కాంట్రాక్టుల కోసం కేసీఆర్ చుట్టూ 300 సార్లు తిరిగిన విషయం గుర్తులేదా?: రాజగోపాల్‌రెడ్డిపై మంత్రి జగదీశ్‌రెడ్డి ఫైర్

  • రూ. 21 వేల కోట్ల కాంట్రాక్టుల కోసం రాజగోపాల్‌రెడ్డి అమ్ముడుపోయారు
  • కేసీఆర్ చుట్టూ 300సార్లు ప్రదక్షిణలు చేశారు
  • 8 ఏళ్ల పాలనలో ఏం అభివృద్ధి జరిగిందని బీజేపీలోకి వెళ్తున్నారు
  • మునుగోడు ఉప ఎన్నిక ద్రోహులు-ప్రజా చైతన్యానికి మధ్య పోటీ అని అభివర్ణన
కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై టీఆర్ఎస్ నేత, మంత్రి జగదీశ్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంట్రాక్టులు ఇస్తే టీఆర్ఎస్‌లోకి వస్తానన్న దొంగ రాజగోపాల్‌రెడ్డి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇందుకోసం కేసీఆర్ చుట్టూ 300 సార్లు ప్రదక్షిణలు చేశారని విమర్శించారు. రూ. 21 వేల కోట్ల కాంట్రాక్టుల కోసం ఆయన అమ్ముడుపోయినట్టు సాక్ష్యాలు ఉన్నాయని అన్నారు. అలాంటి వ్యక్తికి కేసీఆర్‌ను విమర్శించే అర్హత లేదని జగదీశ్‌రెడ్డి అన్నారు. నిన్న మునుగోడులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. 

ఫ్లోరైడ్ సమస్యతో దశాబ్దాలుగా బాధపడుతున్న నల్గొండ ప్రజలకు మిషన్ భగీరథ ద్వారా విముక్తి కల్పించారని అన్నారు. ఎనిమిదేళ్ల బీజేపీ పాలనలో ఏ అభివృద్ధి జరిగిందని కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి వెళ్తున్నారో చెప్పాలని రాజగోపాల్ రెడ్డిని డిమాండ్ చేశారు. నిత్యావసరాల నుంచి గ్యాస్ ధరల వరకు అన్నింటినీ పెంచేసిన పార్టీలోకి ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నిక దొంగలు, ద్రోహులు, పైరవీకారులకు-ప్రజల చైతన్యానికి మధ్య జరిగే పోటీ అని జగదీశ్‌రెడ్డి అభివర్ణించారు.


More Telugu News