పోలీసులు తీరు మార్చుకోకపోతే.. నేనే రోడ్డెక్కుతా: పవన్ కల్యాణ్

  • మా పార్టీ దిమ్మలను పగులగొట్టిన వైసీపీ నేతలపై కేసులు ఎందుకు పెట్టలేదన్న పవన్ 
  • అధికార పార్టీకి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపణ 
  • రేపు ఇంకో పార్టీ అధికారంలోకి వస్తే తల దించుకునే పరిస్థితి రాకూడదని వ్యాఖ్య 
జనసేన నేత పోతిన వెంకట మహేశ్ ను పోలీసులు అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. పోతిన మహేశ్ అరెస్ట్ ను ఆయన ఖండించారు. తమ పార్టీ దిమ్మలను వైసీపీ నేతలు పగులగొడితే వారిపై కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. రాష్ట్ర పోలీసుల తీరు మారకపోతే తానే రోడ్డెక్కుతానని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కల్పించకూడదనే తాను సంయమనం పాటిస్తున్నానని చెప్పారు. 

జనసేన శ్రేణులు తలపెడుతున్న ప్రతి కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకుంటున్నారని... అధికార పార్టీకి వత్తాసు పలికేందుకే ఇలా చేస్తున్నారని అన్నారు. వైసీపీ నేతలు వాడవాడల్లో పెడుతున్న విగ్రహాలు, జెండా దిమ్మలకు ముందస్తుగా మున్సిపల్, పంచాయతీల అనుమతి తీసుకుంటున్నారా? అని ప్రశ్నించారు. వైసీపీ కార్యక్రమాలన్నింటికీ అనుమతులు ఉన్నాయని పోలీసులు చెప్పగలరా అని నిలదీశారు. 

జనసేనను ఎవరూ ఏమీ చేయలేరని... ప్రజలే జనసేనను కాపాడుకుంటారని పవన్ చెప్పారు. వైసీపీ ప్రభుత్వ పెద్దలు, ఎమ్మెల్యేలు ఈరోజు ఉంటారు, రేపు పోతారని... వచ్చే ఎన్నికల తర్వాత మరో పార్టీ అధికారంలోకి వస్తే పోలీసులు తల దించుకునే పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నానని తెలిపారు.


More Telugu News