అయోధ్యలో యోగి ఆదిత్యనాథ్ రాముడిగా గుడి.. వైరల్ అవుతున్న ఫొటోలు!

  • యోగి ఆదిత్య నాథ్ రాముడు అంటూ గుడికట్టిన ఆధ్యాత్మిక గాయకుడు
  • అయోధ్య రామాలయానికి 15 కిలోమీటర్ల దూరంలో ఆలయం
  • చేతిలో విల్లు, బాణాలతో గోడపై చిత్రం.. నిత్యం పూజలు
అయోధ్య అనగానే రాముడు పుట్టిన స్థలమని గుర్తుకువస్తుంది. అక్కడ కట్టనున్న రామాలయం గుర్తుకువస్తుంది. అదే అయోధ్యలో ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు గుడికట్టి రాముడిగా పూజిస్తున్న వార్త సంచలనం రేపుతోంది. ప్రభాకర్ మౌర్య అనే ఆధ్యాత్మిక గాయకుడు యోగి ఆదిత్యనాథ్ కు భక్తుడిగా మారిపోయారు. యోగి ఆదిత్యనాథ్ రాముడిగా గుడి కట్టించి.. ఇటీవలే ప్రారంభించారు

అయోధ్య రామాలయానికి 15 కిలోమీటర్ల దూరంలో.. 
  • అయోధ్య జిల్లా భరత్ కుండ్ ప్రాంతంలోని పూర్వా గ్రామానికి చెందిన ఆధ్యాత్మిక గాయకుడు ప్రభాకర్ మౌర్య యోగి ఆదిత్యనాథ్ కు గుడి కట్టి పూజిస్తున్నారు. అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయానికి ఇది సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
  • కుడిచేతిలో విల్లు, వెనుక బాణాలు, తల వెనుక సూర్యుడి చిత్రంతో నడుచుకుంటూ వస్తున్నట్టుగా ఉన్న యోగి ఆదిత్యనాథ్ విగ్రహాన్ని ఆలయంలో ఓ గోడపై చెక్కినట్టుగా ప్రతిష్టించారు.
  • 30 ఏళ్ల కిందట వచ్చిన రామాయణం సీరియల్ లోని రాముడి తరహాలో యోగి ఆదిత్యనాథ్ ముఖ కవళికలతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ రోజూ పూజలు కూడా చేస్తున్నారు.

2015లో శపథం చేసి..
  • అయోధ్యలో రామాలయం నిర్మాణం కావాలన్నది తన కల అని, రాముడి గుడి ఎవరు కట్టిస్తే వారికి గుడి కట్టి పూజ చేస్తానని 2015లో శపథం చేశానని ప్రభాకర్ మౌర్య తెలిపారు. ఆ కలను నెరవేరుస్తున్న యోగి ఆదిత్యనాథ్ కూడా రాముడేనని పేర్కొన్నారు.
  • ఈ ఆలయం కట్టడానికి సుమారు రూ.8.5 లక్షలు ఖర్చు అయిందని, రాజస్థాన్ లో విగ్రహాన్ని తయారు చేయించి తెచ్చి ప్రతిష్టించానని ప్రభాకర్ మౌర్య వెల్లడించారు.
  • ఇంతకుముందు మహారాష్ట్రలోని పూణె సమీపంలో మయూర్ ముండే అనే వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీకి గుడి కట్టించారు. దానిని గత ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం రోజున తెరిచి పూజలు కూడా ప్రారంభించారు.


More Telugu News