సోనియాతో అశోక్ గెహ్లాట్ భేటీ... 2 గంట‌ల‌కు పైగా కొన‌సాగిన చ‌ర్చ‌లు

  • ఢిల్లీలో సోనియాతో భేటీ అయిన గెహ్లాట్‌
  • కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వి ఎన్నిక‌ల‌పైనే చ‌ర్చ‌
  • రాహుల్ బ‌రిలోకి దిగ‌నంటేనే నామినేష‌న్ వేస్తాన‌న్న రాజ‌స్థాన్ సీఎం
  • రేపో, ఎల్లుండో రాహుల్‌తో భేటీ కోసం కేర‌ళ‌కు గెహ్లాట్‌
  • రాహుల్ స‌రే అంటే సోమ‌వారం నామినేష‌న్ వేయ‌నున్న గెహ్లాట్‌
  • పార్టీ త‌న‌కు అన్నీ ఇచ్చింద‌న్న సీనియ‌ర్ నేత‌
కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి ఎన్నికలు జ‌ర‌గ‌నున్న‌ వేళ రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రిగా కొన‌సాగుతున్న ఆ పార్టీ సీనియ‌ర్ నేత అశోక్ గెహ్లాట్ బుధ‌వారం ఢిల్లీకి వెళ్లారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న నేరుగా పార్టీ తాత్కాలిక అధ్య‌క్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. దాదాపు 2 గంట‌ల‌కు పైగా సాగిన ఈ భేటీలో పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌పైనే చ‌ర్చ సాగిన‌ట్లు స‌మాచారం.

కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేయాలంటూ గెహ్లాట్‌ను సోనియా గాంధీ కోరార‌ని, అయితే రాహుల్ గాంధీ అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేయ‌న‌ని చెబితేనే... తాను నామినేష‌న్ వేస్తాన‌ని గెహ్లాట్ చెప్పిన‌ట్లు స‌మాచారం. ఈ ప్ర‌తిపాద‌న‌కు సోనియా గాంధీ సానుకూలంగానే స్పందించిన‌ట్లుగా తెలుస్తోంది.

సోనియాతో భేటీ ముగించుకుని బ‌య‌ట‌కు వ‌చ్చిన గెహ్లాట్ మీడియాతో మాట్లాడుతూ ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం రాహుల్ సాగిస్తున్న భార‌త్ జోడో యాత్రతో బీజేపీలో భ‌యం మొద‌లైంద‌ని ఆయ‌న అన్నారు. ఇలాంటి కీల‌క స‌మ‌యంలో పార్టీ తీసుకునే నిర్ణ‌యాలు భ‌విష్య‌త్తును నిర్ణ‌యిస్తాయ‌న్నారు. గ‌డ‌చిన 40, 50 ఏళ్లుగా పార్టీ త‌న‌కు ఎన్నో ప‌ద‌వులు ఇచ్చింద‌ని, ఇప్పుడు ఏ ప‌ద‌వి కూడా త‌న‌కేమీ ముఖ్యం కాద‌ని ఆయ‌న అన్నారు. అయితే పార్టీ అభివృద్ధి కోసం ఏ ప‌ద‌వి చేప‌ట్ట‌మ‌ని హైక‌మాండ్ ఆదేశిస్తే ఆ ప‌ద‌వి చేప‌ట్టేందుకు త‌న‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని వెల్ల‌డించారు. 

ఇదిలా ఉంటే... ఒకటి, రెండు రోజుల్లో ఆయ‌న కేర‌ళ‌లో భార‌త్ జోడో యాత్ర‌లో సాగుతున్న రాహుల్ గాంధీని క‌లిసేందుకు వెళ్ల‌నున్న‌ట్లు స‌మాచారం. రాహుల్‌తో అధ్య‌క్ష ప‌దవి ఎన్నిక‌ల‌పై చ‌ర్చించిన త‌ర్వాత‌... అధ్య‌క్ష ప‌దవికి రాహుల్ పోటీ ప‌డ‌న‌ని చెబితే... సోమ‌వారం ఆ ప‌ద‌వి కోసం గెహ్లాట్ నామినేష‌న్ వేయ‌నున్న‌ట్లుగా పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. వెర‌సి రాహుల్‌, గెహ్లాట్‌ల మ‌ధ్య జ‌ర‌గ‌నున్న భేటీ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి ఎన్నిక‌లు ఎలా జ‌ర‌గ‌బోతున్నాయ‌న్న అంశాన్ని నిర్ణ‌యిస్తాయ‌న్న దిశ‌గా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.


More Telugu News