ఇరాన్‌లో జరుగుతున్న హిజాబ్ వ్యతిరేక ఆందోళనలకు మద్దతు.. స్టేజిపైనే జుట్టు కత్తిరించుకున్న టర్కిష్ సింగర్: వీడియో ఇదిగో

  • వేదికపైనే జుట్టు కత్తిరించుకున్న టర్కిష్ సింగర్ మెలెక్ మోసో
  • 22 ఏళ్ల విద్యార్థిని మృతి తర్వాత వెల్లువెత్తిన ఆందోళనలు
  • జుట్టును కత్తిరించుకుంటూ, హిజాబ్‌ను తగలబెడుతూ ఆందోళనలు
  • ఘర్షణల్లో 75 మంది వరకు మృతి
ఇరాన్‌లో జరుగుతున్న హిజాబ్ వ్యతిరేక ఆందోళనలకు టర్కిష్ సింగర్ మెలెక్ మోసో సంఘీభావం ప్రకటించింది. ఆందోళనకారులకు మద్దతుగా నిలిచిన ఆమె తాను ప్రదర్శన ఇస్తున్న వేదికపైనే జుట్టు కత్తించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హిజాబ్‌ను సరిగా ధరించలేదన్న కారణంతో 22 ఏళ్ల విద్యార్థిని అమినిని ఇరాన్ నైతిక విభాగం పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె తీవ్ర గాయాలతో మృతి చెందింది. 

ఈ నెల 17న జరిగిన ఈ ఘటన వెలుగులోకి రావడంతో మొదలైన ఆందోళనలు ఇప్పుడు దేశమంతా విస్తరించాయి. 46 నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఆందోళనలను అదుపు చేసే క్రమంలో భద్రతా బలగాలు, నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఇప్పటి వరకు 75 మంది మరణించినట్టు తెలుస్తోంది. హిజాబ్ వ్యతిరేక ఆందోళనల్లో పాలుపంచుకుంటున్న మహిళలు జుట్టు కత్తిరించుకుంటున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. అలాగే, దేశంలో అమలవుతున్న కఠిన డ్రెస్‌కోడ్‌ను నిరసిస్తూ హిజాబ్‌ను తొలగించి వాటిని మంటల్లో వేసి కాల్చి బూడిద చేస్తున్నారు. 

ఇరాన్ షరియా చట్టాలు చెబుతున్నది ఇదే..

ఏడేళ్లు దాటిన చిన్నారుల నుంచి మహిళలందరూ తమ జుట్టును కనిపించకుండా కప్పుకోవాలి. పొడవైన, వదులైన దుస్తులు ధరించాలి. హిజాబ్ చట్టాన్ని అమలు చేయాలని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ జులై 5న ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మహిళలు ఎలాంటి దుస్తులు ధరించాలనే దానిపై కొత్త ఆంక్షల జాబితా అమల్లోకి వచ్చింది. 

ఇక ఈ ఆంక్షలను ఉల్లంఘించిన వారిని బహిరంగంగా మందలించడంతోపాటు జరిమానాలు విధిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అరెస్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే హిజాబ్‌ను సరిగా ధరించలేదంటూ మహస అమిని అనే విద్యార్థినిని నైతిక విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆమె చనిపోవడంతో దేశం నిరసనలతో కల్లోలంగా మారింది.


More Telugu News