మ‌ణిర‌త్నంకు నో అనే స‌మాధాన‌మే న‌చ్చ‌దంటున్న‌ హీరో కార్తీ

  • దిగ్గ‌జ ద‌ర్శ‌కుడిపై ప్ర‌శంస‌లు కురిపించిన హీరో
  • మ‌ణి క‌ల‌ల ప్రాజెక్టు పీఎస్1లో ప్ర‌ధాన పాత్ర పోషించిన కార్తీ
  • ఆ ప్రాజెక్టు కోసం మ‌ణిర‌త్నం 40 ఏళ్లుగా ఎదురు చూస్తున్నార‌న్న హీరో
ద‌క్షిణాదిలో దిగ్గ‌జ ద‌ర్శ‌కుల్లో ఒక‌రైన మ‌ణిర‌త్నంపై హీరో కార్తీ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. మ‌ణిర‌త్నం ఏదైనా చేయాల‌నుకుంటే చేసి తీరుతాడ‌ని చెప్పాడు. ఆయ‌నకు నో అనే స‌మాధానం అస్స‌లు న‌చ్చ‌ద‌న్నాడు. మణిరత్నం క‌ల‌ల ప్రాజెక్ట్  పొన్నియిన్ సెల్వన్ (పీఎస్1)లో కార్తీ  ప్రధాన పాత్ర వల్లవరాయన్ వంతీయతేవన్‌గా నటించాడు. 2017లో మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన కాట్రు వెలియిడైలో హీరోగా చేసిన కార్తీ.. గ‌తంలో మ‌ణి ద‌గ్గ‌ర అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా కూడా ప‌ని చేశాడు. ఇంతకుముందు మణిరత్నంతో కలిసి పనిచేసిన త‌న‌కు పీఎస్1 లో మ‌రోసారి ఆయ‌న‌తో క‌లిసి ప‌ని చేయ‌డం పెద్ద పాఠం అని కార్తీ అంటున్నాడు.  

”మణి సార్‌లో నేను చూసిన గొప్ప ల‌క్ష‌ణం ఏంటంటే ఆయ‌న ఎప్పుడూ ప్ర‌య‌త్నాన్ని విర‌మించరు. అనుకున్న‌ది చేసి తీరుతారు. దీనికి ఈ చిత్ర‌మే ఉదాహ‌ర‌ణ‌. 40 సంవత్సరాలుగా దీన్ని చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ, చాలా సార్లు ఆయ‌న ప్ర‌య‌త్నాలు విఫ‌ల‌మయ్యాయి. అయినా ఆయ‌న ప‌ట్టు వ‌ద‌ల్లేదు. ఒక ప్రాజెక్టు కోసం ఎవ‌రైనా ఇన్ని సంవ‌త్స‌రాలు వేచి చూస్తారంటే ఊహించుకోవ‌డమే క‌ష్టం. 

ఈ తరంలో మ‌నం ఏ విష‌యానికైనా 6 నెలల కంటే ఎక్కువ స‌మ‌యం వెచ్చించం. అది కాక‌పోతే ఇంకోటి అనుకుంటాం. అందుకే గొప్ప విషయాలు సులభంగా రావు. సుదీర్ఘ కాలం క‌ష్ట‌ప‌డితేనే అది సాధ్యం అవుతుంది.  అది ఈ సినిమాకు పని చేస్తున్నప్పుడు నేర్చుకున్న విషయం. ఇతరులు నా గురించి ఏం మాట్లాడుతున్నారో ఆలోచించవద్దని మ‌ణి సార్ నాకు చెప్పారు. నువ్వేంటో నీకు తెలిసినప్పుడు ఇత‌రుల అభిప్రాయాల‌ను పట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు” అని కార్తీ చెప్పుకొచ్చాడు.


More Telugu News